మందిర నిర్మాణంపై నిస్సిగ్గు రాజకీయం : మోడీపై ఏచూరి ఆగ్రహం

  • ప్రభుత్వ పథకాలను తన గొప్పలుగా చెప్పుకుంటున్నారు
  • పతాక స్థాయికి అధికార కాంక్ష

న్యూఢిల్లీ : రామ మందిర నిర్మాణాన్ని బిజెపి నిస్సిగ్గుగా, బహిరంగంగా రాజకీయం చేస్తోందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ పథకాలను తన గొప్పలుగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. కాషాయ పతాకం నేపథ్యంతో ప్రధాని మోడీ ఉన్న ఓ చిత్రాన్ని ఏచూరి సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. ఐదు వందల కిలోమీటర్ల మెట్రో, 51 కోట్ల బ్యాంక్‌ ఖాతాలు, నాలుగు కోట్ల ఉచిత ఇళ్లు, 315 వైద్య కళాశాలలు, 45 కోట్ల ముద్ర రుణాలు, 220 కోట్ల ఉచిత టీకాలు, 11 కోట్ల కుటుంబాలకు పైపుల ద్వారా నీరు, పది వేల జన్‌ ఔషధి కేంద్రాలు, 10 కోట్ల ఎల్‌పీజీ కనెక్షన్లు, 70 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు అందించిన తర్వాత రామమందిరాన్ని నిర్మిస్తున్నారని వివరిస్తూ కాషాయ పతాకం నేపథ్యంతో ప్రధాని మోడీ ఫొటోతో కూడిన చిత్రం వివిధ సామాజిక మాధ్యమ వేదికలలో వైరల్‌ అవుతోంది. ఈ చిత్రాన్ని ఏచూరి షేర్‌ చేస్తూ ‘ఇది ఎన్నికల ప్రయోజనాల కోసం రామ మందిర నిర్మాణాన్ని నిస్సిగ్గుగా, బహిరంగంగా రాజకీయం చేయడం కాక మరేమిటి? ఇది ప్రజల విశ్వాసాలను, మతపరమైన భావోద్వేగాలను పూర్తిగా దుర్వినియోగం చేయడం, అవమానించడమే’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రజల శ్రేయోభిలాషిగా తనను తాను ప్రచారం చేసుకునేందుకు ప్రధాని మోడీ ప్రభుత్వ పథకాలు, నిధులను వాడుతున్నారు. తానో ధార్మికవాదినని చెప్పుకుంటున్నారు. మోడీ ప్రచారానికి మోసపూరిత వాదనలే ఆధారం. అధికారం, ఆధిపత్యం పొందాలన్న ఆకాంక్ష పతాక స్థాయికి చేరింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా అందిన ఆహ్వానాన్ని ఏచూరి గతంలోనే తిరస్కరించారు. మతం అనేది వ్యక్తిగతమని, దానిని రాజకీయ ప్రయోజనాల కోసం ఓ సాధనంగా వాడరాదని సిపిఎం ఇదివరకే స్పష్టం చేసిన సంగతి విదితమే.

➡️