అసోంలో సిట్టింగ్‌ ఎంపీకి షాక్‌

Apr 22,2024 00:49 #2024 election, #canceled, #MP, #nomination
  •  తిరస్కరణకు గురైన నబా సరానియా నామినేషన్‌

కోక్రాఝర్‌ (అసోం): ఇప్పటికే రెండు సార్లు గెలిచి హ్యాట్రిక్‌ సాధించాలని కలలుగన్నకోక్రాఝర్‌ ఎంపి నబ కుమార్‌ సరానియాకు ఊహించని షాక్‌ తగిలింది. ఆయన నామినేషన్‌ చెల్లదని ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించడంతో అవాక్కయ్యారు. నామినేషన్ల స్క్రూటిని అనంతరం జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ప్రదీప్‌ కుమార్‌ ద్వివేది ఈ విషయం వెల్లడించారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 16 నామినేషన్లు దాఖలయ్యాయి. పరిశీలన అనంతరం నబకుమార నామినేషన్‌ పత్రాలు సరిగా లేవన్న కారణంతో అధికారులు దానిని తిరస్కరించారు. దీంతో కోక్రాఝర్‌లో పోటీ నుంచి ఆయన అనివార్యంగా నిష్క్రమించాల్సి వచ్చింది.
షెడ్యూల్డ్‌ తెగలకు రిజర్వ్‌ చేయబడిన కోక్రాఝర్‌తో పాటు గౌహతి, బార్‌పేట, ధుబ్రీలలో మే 7న మూడో దశలో ఓటింగ్‌ జరగనున్నది.
2014 నుంచి ఇండిపెండెంట్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న గణ సురక్ష పార్టీ(జీఎస్పీ) అధినేత సరానియా.. తన ఎస్టీ (ప్లెయిన్స్‌) హౌదాను స్టేట్‌ స్క్రూటినీ కమిటీ కొట్టివేయటాన్ని సవాలు చేస్తూ గౌహతి హైకోర్టును ఆశ్రయించారు. అయితే, కోర్టు దానిని గురువారం కొట్టివేసింది.
ఆల్‌ అస్సాం గిరిజన సంఘంచేత 1986 నవంబర్‌ 18న జారీ చేయబడిన సర్టిఫికెట్‌ను ఆయన తన నామినేషన్‌తో జతపరిచారు. అందులో తాను ‘రావ’ కమ్యూనిటీకి చెందినవాడినని పేర్కొన్నారు. అయితే, ఆ సర్టిఫికెట్‌ను జారీ చేసిన అథారిటీ సంతకం ఏమీ లేదన్న కారణంతో దానిని తిరస్కరించారు. ఒక వ్యక్తి రెండు వేర్వేరు కమ్యూనిటీలకు చెందినవాడుగా కొనసాగలేడని, వేర్వేరు కమ్యూనిటీలకు చెందిన రెండు ఎస్టీ సర్టిఫికెట్లను కలిగి ఉండకూడదని ఎన్నికల అధికారి చెప్పారు.

➡️