సంక్షోభాన్ని పరిష్కరించండి

  • వినియోగదారులను వెళ్లిపోనివ్వొద్దు
  • 4జి, 5జి సేవలందేలా చూడండి
  • కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రికి బిఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ లేఖ

న్యూఢిల్లీ :   భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బిఎస్‌ఎన్‌ఎల్‌) ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని బిఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి అశ్విని వైష్ణవ్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బుధవారం మంత్రికి ఒక లేఖ రాశారు. 4జి అమలుకు అవసరమైన పరికరాలను టాటా కన్సల్టెన్నీ సర్వీసెస్‌ (టిసిఎస్‌) అందజేయడంలో తీవ్ర జాప్యం, దానికి తోడు పెద్ద సంఖ్యలో వినియోగదారులు బిఎస్‌ఎన్‌ఎల్‌ను వీడి వెళ్లిపోతుండడంపై దృష్టి సారించాల్సిందిగా యూనియన్‌ ఆ లేఖలో కోరింది. ట్రారు అందజేసిన డేటా ప్రకారం, ప్రతీ నెలా లక్షలాదిమంది వినియోగదారులు బిఎస్‌ఎన్‌ఎల్‌ సేవలను వీడుతున్నారు. గతేడాది ఆగస్టులో 22,20,654మంది వినియోగదారులు వెళ్లిపోగా, సెప్టెంబరు నాటికి ఈ సంఖ్య 23,26,751కి పెరిగింది. 2022లో మొత్తంగా 77లక్షలమంది వినియోగదారులు బిఎస్‌ఎన్‌ఎల్‌ సేవలను వీడారు. దీనికి విరుద్ధంగా రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌ వంటి ప్రైవేటు సంస్థలు ఇదే సమయంలో గణనీయమైన ప్రయోజనాలను పొందడం గమనార్హం.

అధిక స్పీడ్‌ గల డేటా సర్వీసులను అందజేయడంలో బిఎస్‌ఎన్‌ఎల్‌ విఫలమవడమే ఇందుకు కారణంగా వుంది. ఇప్పటికే బరిలో వున్న ప్రైవేటు సంస్థలు 5జి సేవలను దేశవ్యాప్తంగా అందజేస్తుండగా, బిఎస్‌ఎన్‌ఎల్‌ 4జి సేవలను ఇవ్వలేక వెనుకబడడాన్ని యూనియన్‌ ఆ లేఖలో ప్రధానంగా ప్రస్తావించింది. టిసిఎస్‌ అవసరమైన పరికరాలను అందజేయడంలో తీవ్రమైన జాప్యం జరుగుతోందని పేర్కొంది. గతేడాది మేలో మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఒక ప్రకటన జారీ చేస్తూ, మరో రెండు వారాల్లో 4జి సేవలు అందుబాటులోకి వస్తాయని, డిసెంబరు కల్లా 5జి సేవలు అమలవుతాయని హామీ ఇచ్చారు. ఈ అంచనాలకు పూర్తి భిన్నమైన స్థాయిలో వాస్తవం వుంటోందని యూనియన్‌ తన లేఖలో పేర్కొంది. ఇప్పటివరకు క్షేత్ర స్థాయిలో ట్రయల్స్‌నే టిసిఎస్‌ పూర్తి చేయలేదని విమర్శించింది. తాజాగా ఈ ఏడాది అక్టోబరు డెడ్‌లైన్‌గా విధించారని ప్రస్తుతమున్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే ఈ గడువు చాలా సుదీర్ఘమైనదని ఆ లేఖ పేర్కొంది. కేంద్ర మంత్రి తక్షణమే ఈ విషయంలో జోక్యం చేసుకుని, 4జి, 5జి సేవలను త్వరితగతిన ప్రజలకు అందించేలా చర్యలు తీసుకోవాలని యూనియన్‌ కోరింది. కంపెనీని పునరుద్ధరించాలంటే వినియోగదారులు వెళ్లిపోవడాన్ని తక్షణమే ఆపాల్సిన అవసరం వుందని పేర్కొంది. ప్రస్తుతం బిఎస్‌ఎన్‌ఎల్‌ ఎదుర్కొంటున్న సవాళ్ళను అధిగమించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా యూనియన్‌, కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసింది.

➡️