కేరళను తాకిన రుతుపవనాలు

May 31,2024 08:13 #kerala, #Monsoon hits

న్యూఢిల్లీ, అమరావతి బ్యూరో : మండే ఎండలతో అల్లాడిపోతున్న ప్రజానీకానికి చల్లని కబురు అందింది. అనుకున్నదానికన్నా ఒక రోజు ముందుగానే నైరుతి రుతుపవనాలు గురువారం కేరళను తాకాయి. సాధారణంగా జూన్‌ 1వ తేదీకి ఒక రోజు అటు ఇటూగా కేరళకు రుతుపవనాలు వస్తాయి. నెమ్మదిగా జులై 15నాటికి దేశమంతా విస్తరిస్తాయి. రుతుపవనాల రాకకు అవసరమైన వాతావరణ పరిస్థితులన్నీ సానుకూలంగా వున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతూ వచ్చారు. ఈ ఉదయం తొలకరి జల్లులు కేరళను పలకరించాయి. కేరళ, ఈశాన్య భారతంలో పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని ఐఎండి ఎక్స్‌లో ట్వీట్‌ చేసింది.
వరుసగా రెండు రోజుల పాటు కేరళలోని 14 ప్రాంతాల్లో 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రుతుపవనాల బలాన్ని సూచించేలా పశ్చిమ దిశగా బలమైన గాలులు వీస్తున్నాయి. నాలుగు మాసాల పాటు వుండే నైరుతి రుతుపవనాల సీజన్‌లో కేరళ సగటు వర్షపాతం 2018.7 మి.మీగా వుంటుంది. అందులో ప్రారంభ మాసమైన జూన్‌లో కురిసే వర్షం దాదాపు 648.3 మి.మీగా వుంటుంది. 123 సంవత్సరాల కేరళ రుతుపవనాల డేటాను పరిశీలిస్తే జులైలో అధిక వర్షపాతం నమోదవుతుంది. సగటున 653.4 మి.మీ వుంటుంది.

నాలుగు రోజుల్లో రాష్ట్రంలోకి…
మూడు, నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోకి నైరుతి రుతుపవనాలు వస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. సీజన్‌కు అనుగుణంగా రుతుపవనాలు వస్తుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 45 డిగ్రీల నుంచి 48 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రుతుపవనాల రాక కొంత ఉపశమనం కలిగిస్తోంది. వాతావరణ పరిస్థితుల రీత్యా ఈ ఏడాది వర్షాలు బాగాపడే అవకాశం ఉందని, సాధారణం కంటే ఎక్కువ నమోదవుతుందని ఐఎమ్‌డి అంచనా వేసింది. ఎల్‌నినో ప్రభావంతో గతంలో సరైన సమయంలో వర్షాలు కురవలేదని, ఈసారి బాగా కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇటీవల కురిసిన వర్షాలకు కృష్ణా డెల్టా పరిధిలో రైతులు దుక్కులు మొదలుపెట్టారు. ఈసారి వర్షాలు బాగా పడే అవకాశం ఉందని తెలియడంతో రైతుల్లోనూ ఆనందం వ్యక్తమవుతోంది.

➡️