జైళ్లలో కుల వివక్ష : కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

upreme-court-issues-notice-to-centre-13-states-on-journalists

 

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : జైళ్లలో కుల వివక్షపై స్పందన తెలపాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. రాష్ట్రాల్లోని జైలు మాన్యువల్‌లు ఖైదీల మధ్య కుల ఆధారిత వివక్షను ప్రోత్సహిస్తున్నాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను బుధవారం సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ జెబి పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్‌ లేవనెత్తిన ఈ సమస్య చాలా కీలకమైనదని ధర్మాసనం అంగీకరించింది. దానిని పరిష్కరించడంలో కోర్టుకు సహాయం చేయవలసిందిగా సొలిసిటర్‌ జనరల్‌ (ఎస్జి) తుషార్‌ మెహతాను కోరింది.’ఇది చాలా ముఖ్యమైన అంశంగా లేవనెత్తబడింది. ఈ కోర్టుకు సహాయం చేయవలసిందిగా మేము ఎస్‌జి మెహతాను అభ్యర్థిస్తున్నాము. అన్ని రాష్ట్ర మాన్యువల్‌లను పట్టికలో ఉంచబడిన చార్ట్‌లో ఉంచనివ్వండి’ అని ధర్మాసనం ఆదేశించింది. ఎస్‌జి మెహతా కూడా ఈ పరిస్థితి ‘ఆమోదించదగినది కాదు’ అని అన్నారు. దీనిని పరిష్కరించడంలో ఉమ్మడి ప్రయత్నాల ఆవశ్యకత ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. జైలు బ్యారక్‌లలో కుల ఆధారిత వివక్ష కొనసాగుతోందని, మాన్యువల్‌ లేబర్‌ అసైన్‌మెంట్ల వరకు విస్తరించిందని, డీనోటిఫైడ్‌ తెగలు, అలవాటైన నేరస్తులుగా వర్గీకరించబడిన వారిని ప్రభావితం చేస్తుందని పేర్కొంటూ జర్నలిస్ట్‌ సుకన్య శాంత కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వివిధ రాష్ట్రాల జైలు మాన్యువల్స్‌లో ఉన్న వివక్షతో కూడిన నిబంధనలను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. పిటిషనర్‌ తరపున సీనియర్‌ న్యాయవాది ఎస్‌ మురళీధర్‌ వాదనలు వినిపిస్తూ.. దళితులు ప్రత్యేక జైళ్లలో నిర్భందించిన సందర్భాలు కూడా ఉన్నాయని, ఇతర కులాలకు చెందిన వ్యక్తులను వివిధ ప్రాంతాల్లో నిర్భందించారని వివరించారు. ‘ఇటువంటి కుల ఆధారిత వివక్ష జైలులో అడుగుపెట్టినప్పటి నుండి ఉంది’ అని అన్నారు. ప్రాథమిక వాదనలు సంక్షిప్తంగా విన్న ధర్మాసనం, కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, పంజాబ్‌, ఒడిశా,ఝార్ఖండ్‌, కేరళ, తమిళనాడు, మహారాష్ట్రకు నోటీసులు జారీ చేసింది.

➡️