ఖైదీల ములాఖత్‌పై పరిమితిని సమర్థించిన సుప్రీం కోర్టు

Jan 10,2024 11:00 #Supreme Court

న్యూఢిల్లీ : కారాగాల్లో శిక్ష లేదా రిమాండ్‌ కోసం బంధీగా ఉన్న ఖైదీలను కలవడం (ములాఖత్‌)పై పరిమితి విధిస్తూ ఢిల్లీ హైకోర్టు గతేడాది ఫిబ్రవరి 16న తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఖైదీలతో మాట్లాడేందుకు పరిమితులు లేకుండా ములాఖత్‌కు అవకాశం కల్పించాలని, ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ న్యాయవాది జై అనంత్‌ దేహద్రారు దాఖలు చేసిన పిటిషన్‌లో సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జైళ్లలో ఉన్న ఖైదీలను వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, న్యాయ సలహాదారులు వారానికి రెండుసార్లు మించి కలవరాదంటూ ఇటీవల ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని వెలువరించింది. ఇది విధానపరమైన నిర్ణయమైనందన దీంట్లో తాము జోక్యం చేసుకోవాలనుకోవడం లేదని జస్టిస్‌ బెలా ఎం త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిథాల్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది. జైళ్లలోని ఖైదీల సంఖ్యను, సౌకర్యాలను పరిగణనలోకి తీసుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందని, ఇది ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం కాదని, వేధింపుల కింద కూడా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

➡️