Swati Maliwal Case : బిభవ్‌కుమార్‌ జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

న్యూఢిల్లీ : ఆప్‌ రాజ్యసభ ఎంపి స్వాతిమాలివాల్‌పై ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యక్తిగత అనుచరుడు బిభవ్‌కుమార్‌ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు బిభవ్‌కుమార్‌ జ్యుడిషియల్‌ కస్టడీని ఢిల్లీలోని తీస్‌ హజారీ కోర్టు మరో రెండువారాల పాటు పొడిగించింది. మే 13వ తేదీన ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసంలో స్వాతిమలివాల్‌పై కేజ్రీవాల్‌ అనుచరుడు బిభవ్‌ దాడి చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు బిభవ్‌ని మే 18వ తేదీన పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతుంది. ఈ కేసును ఢిల్లీలోని తీస్‌ హజారీ కోర్టు విచారిస్తుంది. గతంలో విధించిన బిభవ్‌ జ్యుడిషియల్‌ కస్టడీ ముగియడంతో.. పోలీసులు శనివారం తీస్‌ హజారీ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో బిభవ్‌ని ఇంకా విచారించాల్సి ఉందని, మరో రెండువారాల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. దీంతో కోర్టు రెండువారాలపాటు బిభవ్‌ జ్యుడిషియల్‌ కస్టడీని పొడిగించింది. జూలై 6వ తేదీ వరకు బిభవ్‌కుమార్‌ కస్టడీని పొడిగిస్తున్నట్లు కోర్టు పేర్కొంది.

➡️