మైనస్‌-2 డిగ్రీల వద్ద కూచిపూడి నృత్యం

Jun 29,2024 21:01 #Kuchipudi dance, #minus-2 degrees

– ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో తాడిపత్రి కూచిపూడి కళాకారిణిలు
ప్రజాశక్తి – అనంతపురం :ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ వద్ద మైనస్‌-2 డిగ్రీల ఉష్ణోగ్రతలో అనంతపురం జిల్లా తాడిపత్రి వందన డ్యాన్స్‌ అకాడమీకి చెందిన కూచిపూడి కళాకారిణులు సాయి మైత్రి, జ్యోషిత, వర్షిని, నవ్య, సాహిత్య, నిహారికలు కూచిపూడి నృత్యం చేసి ఇండియా బుక్‌ఆఫ్‌ రికార్డులో పేర్లు నమోదు చేసుకున్నారు. అత్యంత ప్రతిభ చాటిన ఈ విద్యార్థులను అనంతపురం కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ అభినందించారు. కలెక్టరేట్‌లో తనను కలిసిన కళాకారిణులను ఆయన సత్కరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. కూచిపూడి కళలో నిష్ణాతులైన ఆరుగురు విద్యార్థినులు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో పేరు దక్కించుకోవడం అభినందనీయమన్నారు. వందన డ్యాన్స్‌ అకాడమీకి చెందిన కూచిపూడి గురువు వందన భర్త ప్రవీణ్‌ మాట్లాడుతూ.. మే 13న కేదార్‌నాథ్‌ ఆలయం వద్ద మైనస్‌-2 డిగ్రీల చలిలో ఉదయం ఏడు గంటల నుంచి 8:30 గంటల వరకు గంటన్నర పాటు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారన్నారు. భవిష్యత్తులో కైలాస పర్వతం (మౌంట్‌ కైలాస్‌) వద్ద నృత్యాన్ని ప్రదర్శించేందుకు తాము సన్నద్ధం అవుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌డిఒ షఫీ తదితరులు పాల్గొన్నారు.

➡️