Supreme Court: బలవంతపు చర్యలుండవు

Apr 2,2024 06:49 #Congress, #Supreme Court, #Tax Relief
  • కాంగ్రెస్‌కు జారీ చేసిన నోటీసులపై సుప్రీం కోర్టులో ఐటి వివరణ

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో వుంచుకునే ఐటి నోటీసులకు సంబంధించి కాంగ్రెస్‌పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవడం లేదని ఆదాయపు పన్ను శాఖ (ఐటి) విభాగం సుప్రీంకోర్టుకు తెలియచేసింది. ఎన్నికల ముందు ఏ రాజకీయ పార్టీకి ఇబ్బందులు కలిగించరాదనుకున్నామని తెలిపింది. ఈ మేరకు ఐటి స్టేట్‌మెంట్‌ను కోర్టు నమోదు చేసింది. కాంగ్రెస్‌ పార్టీ మొత్తంగా రూ.3,567 కోట్ల మేరకు ఆదాయ పన్ను చెల్లించాలని పేర్కొంటూ ఐటి నోటీసులు జారీ చేసింది. కాగా కాంగ్రెస్‌ దీన్ని ‘టాక్స్‌ టెర్రరిజం’గా అభివర్ణించింది. ఈ కేసులో తదుపరి విచారణ జులై 24కి కోర్టు వాయిదా వేసింది.
అప్పటివరకు తాము ఏ పార్టీపైనా ఎవరిపైనా వేధింపుల చర్యలు చేపట్టరాదని నిర్ణయించినట్లు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా జస్టిస్‌ బి.వి.నాగరత్న నేతృత్వంలోని బెంచ్‌కు తెలియచేశారు. ‘మెహతా నాకు మాటల్లేకుండా చేశారు.’ అని ప్రభుత్వ వైఖరిలో అనూహ్యంగా చోటుచేసుకున్న మార్పుపై కాంగ్రెస్‌ తరపు న్యాయవాది ఎ.ఎం.సింఘ్వి వ్యాఖ్యానించారు. గత ఏడు సంవత్సరాల కాలంలోని పార్టీ స్థూల ఆదాయాల మదింపుపై విధించిన పన్ను మొత్తమే రూ.3567కోట్లని మెహతా చెప్పారు.

➡️