రైతులపై ఘాతుకం- 21 ఏళ్ల యువ రైతు బలి

మరో 25 మందికి రబ్బర్‌ బులెట్‌ గాయాలు

హర్యానాలో బిజెపి ప్రభుత్వ దాష్టీకం

హర్యానా-పంజాబ్‌ సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తం

జెసిబి, ప్రొక్లెయినర్స్‌ యజమానులకు బెదిరింపులు

ఐదో దఫా చర్చలకు కేంద్రం పిలుపు

రైతులపై పోలీసు చర్యలను ఖండించిన ఎఐకెఎస్‌, ఎస్‌కెఎం, ఎఐఎడబ్ల్యు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :హర్యానాలో బిజెపి ప్రభుత్వ క్రూరత్వానికి శుభకరణ్‌ సింగ్‌ అనే 21 ఏళ్ల యువ రైతు బలయ్యాడు. మరో 25 మంది గాయపడ్డారు. తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) కావాలని కోరడమే నేరమన్నట్లు హర్యానా ప్రభుత్వం రైతు ఉద్యమంపై ఉక్కుపాదం మోపింది. రైతులు బుధవారం పునరుద్ధరించిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని రక్తసిక్తం చేసింది. రైతులను శత్రువుల్లా చూసి, వారిని అడ్డుకోవడానికి అడుగడుగునా సిమెంటు బారికేడ్లు, ఇనుప ముళ్ల కంచెలు పెట్టింది. చావో రేవో తేల్చుకుంటామని, కనీస మద్దతు ధర చట్టం తెచ్చేవరకు పోరాటం సాగిస్తామంటూ రైతులు ఈ బారికేడ్లను, కంచెలను తోసుకుని ముందుకు వెళ్లేందుకు యత్నించగా హర్యానా పోలీసులు రబ్బర్‌ బులెట్లు, టియర్‌గ్యాస్‌ ఫిరంగులతో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హర్యానా పోలీసుల రబ్బర్‌ బులెట్‌ తలకు తగలడంతో పంజాబ్‌లోని భటిండా జిల్లా బాలోక్‌ గ్రామానికి చెందిన యువ రైతు శుభ కరణ్‌ సింగ్‌ చనిపోయాడు. రబ్బర్‌ బులెట్లతో తీవ్రంగా గాయపడిన రైతులను ఆసుపత్రికి తరలించారు హర్యానా- పంజాబ్‌ సరిహద్దుల్లోని ఖనూరి వద్ధ ఈ ఘాతుకం జరిగింది. హర్యానా ప్రభుత్వ దాష్టీకానికి ఇంతకు ముందు ఇద్దరు రైతులు గుండె ఆగి చనిపోయారు. .

ఈనెల 18నకేంద్ర మంత్రులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో రైతులు బుధవారం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించారు. హర్యానా-పంజాబ్‌ సరిహద్దులు శంభు, ఖానౌరీ నుంచి ఢిల్లీ వైపుగా కదంతొక్కారు. దారికి అడ్డంగా ఉన్న బారికేడ్లను, ఇనుప చువ్వలను, కాంక్రీటు గోడలను తొలగించేందుకు రైతులు హైడ్రాలిక్‌ క్రేజలు, జెసిబిలు, ప్రొక్లెయినర్స్‌తో పక్కకు తొలగించి ముందుకు సాగారు. ఈ క్రమంలో రైతులను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించడంతో పోలీసులు దాడి చేసి ఓ రైతు నిండు ప్రాణాన్ని బలిగొన్నారు. రైతులపై హర్యానా ప్రభుత్వ దాష్టీకాన్ని ఆలిండియా కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌), సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం), అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం (ఎఐఎడబ్ల్యుయు) తీవ్రంగా ఖండించాయి. రైతుల పట్ల మోడీ ప్రభుత్వ దుర్మార్గానికి ఇదొక నిదర్శనమని వ్యాఖ్యానించాయి. పంజాబ్‌ నుంచి ఢిల్లీ వైపు వెళ్తున్న రైతులను శత్రు సైనికుల్లా చూడడం హర్యానాలో బిజెపి ప్రభుత్వానికే చెల్లిందని అవి ఘాటుగా విమర్శించాయి. యువ రైతు మరణానికి అవి సంతాపం తెలిపాయి.

జెసిబి, ప్రొక్లెయినర్స్‌ యజమానులకు బెదిరింపులు

రైతులకు అద్దెకిచ్చిన జెసిబి, ప్రొక్లెయినర్స్‌ యజమానులపై హర్యానా పోలీసులు బెదిరింపులకు దిగారు. రైతుల వద్ద నుంచి జెసిబి, ప్రొక్లెయినర్స్‌ వెనక్కి తీసుకోవాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆందోళన ప్రదేశాల నుంచి తమ జెసిబిలు, ప్రొక్లెయినర్స్‌, బుల్డోజర్లు ఖాళీ చేయించకపోతే సీజ్‌ చేస్తామని హెచ్చరించారు.

ఐదో దఫా చర్చలకు ప్రభుత్వం పిలుపు

ఐదో విడత చర్చలకు రైతులను పిలిచామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్‌ ముండా చెప్పారు. కనీస మద్దతు ధర, పంట మార్పిడి, వ్యర్థాల దహనంపై రైతులతో చర్చకు సిద్ధమని అన్నారు. ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తోందని రైతు సంఘాల నేతలు మండిపడ్డారు. తమ డిమాండ్‌లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించేవరకు ఉద్యమం ఆపేది లేదని రైతులు చెప్పారు.

కనీస మద్దతు ధరకు (ఎంఎస్‌పి) చట్టబద్ధత కల్పిస్తే రైతులు ఆందోళన విరమిస్తారని పంజాబ్‌ కిసాన్‌ మజ్దూర్‌ ప్రధాన కార్యదర్శి శర్వన్‌ సింగ్‌ పాంథర్‌ బుధవారం పునరుద్ఘాటించారు. ఢిల్లీ ఛలోలో కేవలం రైతు నాయకులే ప్రదర్శనగా ఢిల్లీకి వస్తారని, దీనికి ప్రభుత్వం అనుమతించాలని ఆయన కోరారు. రైతుల సమస్యలపై శాంతియుతంగా పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లాలని యువతకు ఆయన విజ్ఞప్తి చేశారు.

➡️