సైన్యమే చంపేసింది !

Dec 24,2023 11:02 #Army, #killed
  • ఆర్మీ అదుపులో ఉన్న ముగ్గురు పౌరుల మృతిపై కాశ్మీర్‌లో ఆందోళనల వెల్లువ
  • చట్టపర చర్యలకు ఆదేశించిన ప్రభుత్వం

శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రదాడికి సంబంధించిన కేసులో అనుమానితులుగా అదుపులోకి తీసుకున్న ముగ్గురు సాధారణ పౌరులను సైన్యమే పొట్టన పెట్టుకుందని పూంచ్‌, రాజౌరి జిల్లాల్లో శనివారం భారీస్థాయిలో ఆందోళనలు చోటుచేసుకున్నాయి. భద్రతా అధికారులను ఎక్కడికక్కడే చుట్టుముట్టి పౌరుల అనుమానస్పద మృతిపై జనం నిలదీశారు. దీంతో ఈ విషయంపై చట్టపరమైన చర్యలు చేపడుతామని జమ్ముకాశ్మీర్‌ సమాచార పౌరసంబంధాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఫూంచ్‌ జిల్లాలో ఐదుగురు సైనికులు అమరులైన ఉగ్రవాద దాడి జరిగిన ప్రాంతానికి సమీపంలోని గ్రామం నుంచి శుక్రవారం ఉదయం 8 మంది పౌరులను విచారణ కోసం సైన్యం తీసుకెళ్లింది. వీరిలో ముగ్గురు అనుమానస్పద రీతిలో ఒంటిపై తీవ్ర గాయాలతో చనిపోయారు. మరో ఐదుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో స్థానిక ప్రజానీకం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. శనివారం నాటికి అవి ఫూంచ్‌, రాజౌరి జిల్లాల మొత్తంగా విస్తరించాయి. మరోవైపు ఆర్మీ జవాన్లు ముగ్గురి వ్యక్తుల బట్టలు విప్పి కారంపొడి చల్లుతున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లిస్తామని, ఒకరికి ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇంటర్నెట్‌ సేవలు మళ్లీ నిలిపివేతఆర్మీ కస్టడీలోని పౌరుల అనుమానాస్పద మరణాలపై ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో శనివారం నుంచి పూంచ్‌, రాజౌరి జిల్లాలలో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. ఈ జిల్లాలలో నెలకొన్న వాస్తవ పరిస్థితిపై సైన్యం, అధికారులు పెదవి విప్పడం లేదు. శాంతి భద్రతల పరిస్థితి తలెత్తకుండా చూసేందుకే ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశామని అధికారులు పేర్కొన్నారు.

➡️