హిందూత్వ – కార్పొరేట్ల బంధం, నిరంకుశత్వంపై బలమైన పోరాటం

Jun 11,2024 08:02 #cpm, #cpm politburo, #PM Modi
  • సిపిఎం పొలిట్‌బ్యూరో పిలుపు

న్యూఢిల్లీ : పద్దెనిమిదవ లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి మెజార్టీ కోల్పోయినప్పటికీ హిందూత్వ నిరంకుశ పోకడలు మరింత పెరిగే ప్రమాదముందని సిపిఎం పొలిట్‌బ్యూరో హెచ్చరించింది. అలాగే హిందూత్వ కార్పొరేట్ల బంధాన్ని అది మరింత పటిష్టపరచుకోవాలని చూస్తోందని, రానున్న రోజుల్లో మోడీ తన ఆధిపత్యాన్ని మరింత గట్టి పరచుకునేందుకు ప్రజల జీవనోపాధిపై ఫాసిస్టు తరహా దాడుల సాగించే ప్రమాదముందని, వీటికి వ్యతిరేకంగా సిపిఎం, ఇండియా బ్లాక్‌లోని భాగస్వాములంతా కలసి శాయశక్తులా పోరాడాలని పొలిట్‌బ్యూరో పిలుపునిచ్చింది. లోక్‌సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సిపిఎం పొలిట్‌బ్యూరో ఆదివారం నాడిక్కడ సమావేశమై ప్రాథమికంగా సమీక్షించింది. సమావేశం అనంతరం ఈ మేరకు ఒక ప్రకటన విడుదలజేసింది. లోక్‌సభ ఎన్నికలు బిజెపికి గట్టి ఎదురుదెబ్బ అని పొలిట్‌బ్యూరో ఆ ప్రకటనలో పేర్కొంది.
రాజ్యాంగం, లౌకికవాద ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు భారత దేశ ప్రజలు ఈసారి బిజెపికి మెజార్టీ దక్కకుండా చేశారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సాధించిన బిజెపి ఈ సారి మెజార్టీకి 32 సీట్ల దూరంలో ఉండిపోయింది. 400కి పైగా సీట్లు వస్తాయంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన బిజెపికి 240సీట్లు రావడమే గగనమైపోయింది. గత లోక్‌సభలో 303 స్థానాలున్న ఆ పార్టీకి ఈసారి 63 సీట్లు తగ్గాయి. అంటే 20శాతం మేర సీట్లు తగ్గాయన్న మాట. బిజెపికి సొంత మెజారిటీ కన్నా 32సీట్లు తగ్గాయి. మిత్రపక్షాలు అదనంగా 52సీట్లను గెలుచుకోవడంతో ఎన్‌డిఎకు 292 సీట్లు వచ్చాయి. అంటే మెజార్టీకి మించి 20 సీట్లే వచ్చాయి.ఇక ఇండియా బ్లాక్‌ 234సీట్లు గెెలుచుకుంది. అంటే మెజారిటీకి 38సీట్లు మాత్రమే తక్కువ.. భారత ఎన్నికల  కమిషన్‌ అందచేసిన డేటా ప్రకారం పోలైన ఓట్లలో ఎన్‌డిఎ కూటమి మొత్తానికి 43.31 శాతం ఓట్లు రాగా ఇండియా బ్లాక్‌కు 41.69శాతం ఓట్లు వచ్చాయి. అంటే ఈ రెండింటి మధ్య ఓట్ల తేడా రెండు శాతం కూడా లేదు.
ప్రతిపక్షాలపై పెద్దయెత్తున దాడులు, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, డబ్బును పెద్దయెత్తున ఖర్చు చేయడం, ఎన్నికలకు ముందు ఇద్దరు ముఖ్యమంత్రులను జైలులోపెట్టడం, కాంగ్రెస్‌, సిపిఎం (కేరళలో ఒక జిల్లాలో) వంటి రాజకీయ పార్టీల బ్యాంక్‌ ఖాతాలు స్తంభింపజేయడం,. ఎన్‌సిపి, శివసేన వంటి ప్రతిపక్ష పార్టీలను చీల్చడం, ధనబలం, బెదిరింపులు, కేంద్ర ర్యాప్తు సంస్థల ఒత్తిళ్లు. ప్రతిపక్షాలను చీల్చేందుకు అన్ని రకాల రాజకీయ కుతంత్రాలకు బిజెపి పాల్పడింది. జెడి(యు)కు ఎరవేసి ఎన్‌డిఎ కూటమిలోకి తిరిగి లాక్కుంది. ఈ నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో అన్ని పక్షాలకు సమాన అవకాశాలను ఎన్నికల సంఘం కల్పించి వుంటే ఎన్‌డిఏకు మరింత ప్రతికూల ఫలితాలు వచ్చి వుండేవి. బిజెపి ఎజెండాను ముందుకు తీసుకెళ్ళడంలో ఎన్నికల కమిషన్‌ పాత్ర తక్కువేమీ కాదు. మోడీ, పలువురు బిజెపి నేతలు చేసే రెచ్చగొట్టే మత విద్వేష ప్రసంగాలను అడ్డుకోవడానికి కానీ, ఎన్నికల నియమావళికి కట్టుబడి ఉండేలా చూడడంలో కానీ ఎన్నికల కమిషన్‌ వెన్నెముక లేనట్టుగా వ్యవహరించింది. పోలైన ఓట్ల వివరాలను వెల్లడించడానికి తొలుత తిరస్కరించడం ద్వారా ఎన్నికల్లో అవకతవకలు చోటుచేసుకోవడంతో అనుమానాలు తలెత్తాయి. ఇది, రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్‌ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసింది.
మీడియాలో అతిపెద్ద సెక్షన్‌ను బిజెపి పూర్తిగా తన అదుపాజ్ఞల్లో పెట్టుకుంది. వాటి ద్వారా తన అభిప్రాయాలను, భావాలను మాత్రమే ప్రచారం చేసేలా చూసుకుకుంది. ఎగ్జిట్‌ పోల్స్‌లో బిజెపికి వాస్తవిక బలం కన్నా చాలా ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పడంలోనే వీటి నైజం బయటపడింది.కార్పొరేట్‌ మీడియా భాగస్వామ్యంతో బిజెపి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టి సోషల్‌మీడియా ద్వారా తప్పుడు కథనాలు, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసింది. ఓటింగ్‌ సరళిని ప్రభావితం చేసేందుకు పెద్ద మొత్తంలో ధన బలాన్ని ఉపయోగించింది. చాలాచోట్ల ఓటర్లకు నేరుగా వేల కోట్ల రూపాయిలు పంచిపెట్టింది.
నిరుద్యోగం, ధరల పెరుగుదల, వ్యవసాయ సంక్షోభం వంటి ప్రజల జీవనోపాధుల సమస్యలపై ఇండియా బ్లాక్‌ పక్షాలు దృష్టి పెట్టాయి. వీటితో పాటు మన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, పౌర హక్కులకు ఎదురువుతున్న ముప్పు, బెదిరింపులను ప్రముఖంగా తమ ప్రచారంలో ప్రస్తావించాయి. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు వారి జీవనోపాధులపై పెద్ద ఎత్తున నిర్వహించిన పోరాటాలు, ముఖ్యంగా రైతాంగ పోరాటాలు ఈ ఫలితాలకు గణనీయంగా దోహపడ్డాయి. మహారాష్ట్ర, పంజాబ్‌, రాజస్థాన్‌, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ల్లో వ్యవసాయ ప్రాంరతాల్లో 38 సిట్టింగ్‌ స్థానాలను బిజెపి కోల్పోయింది. తమ జీవనోపాధులను మోడీ సర్కార్‌ ధ్వంసం చేయడంపై గ్రామీణ భారతం తీవ్రంగా ప్రతిస్పందించింది. మోడీ పదేళ్ల పాలనలో గ్రామీణ వాస్తవిక వేతనాలు పెరగకుండా స్తంభించిపోయాయి. దాదాపు 159 గ్రామీణ నియోజకవర్గాల ప్రజలు మార్పు కోసం ఓటు వేశారని అంచనా.
తన సొంతంగా మెజారిటసాధించలేకపోయినా మోడీ ఆధిపత్యాన్ని తిరిగి కొనసాగించేందుకు, మరింత బలోపేతం కావడానికి యత్నిస్తూనే ఉంటాడు.. హిందూత్వ నిరంకుశవాద ధోరణులను, హిందూత్వ-కార్పొరేట్‌ బంధాన్ని బలోపేతం చేసే ప్రయత్నాల పట్ల ఇండియా బ్లాక్‌ పక్షాలు సదా అప్రమత్తంగా వుంటూ వాటిని తీవ్రంగా ప్రతిఘటించాలి. ఓడించాలి. లౌకిక ప్రజాస్వామ్యాన్ని, ప్రజల జీవనోపాధులను, ఆర్థిక సార్వభౌమాధికారాన్ని, సామాజిక న్యాయాన్ని, సమాఖ్యవాదాన్ని పరిరక్షించాలి. ఫాసిస్ట్‌ పద్దతులు ఉపయోగిస్తున్న హిందూత్వ నిరంకుశవాదానికి వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో పోరాటాన్ని బలోపేతం చేయాలి. పార్లమెంట్‌ లోపల, వెలుపల ఇది జరగాలి.

వామపక్షాల పనితీరు
ఈ లోక్‌సభ ఎన్నికల్లో వామపక్షాలు కాస్త మెరుగుపడ్డాయి. గతసారి వామపక్షాలకు 5 స్థానాలు ఉండగా ఈ సారి ఆ బలం 8కి పెరిగింది. వీటిలో సిపిఎం నాలుగు స్థానాలు, సిపిఐక రెండు, సిపిఎం(ఎంఎల్‌) చెరో రెండు స్థానాలు గెలుచుకున్నాయి. సిపిఎం పనితీరు పట్ల ముఖ్యంగా కేరళలో ఫలితాలపై పొలిట్‌బ్యూరో అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆయా రాష్ట్ర పార్టీ శాఖల సమీక్షల ప్రాతిపదికన పార్టీ కూలంకషంగా సమీక్ష జరుపుతుంది.

నీట్‌ పరీక్ష
నీట్‌ పరీక్ష నిర్వహణలో అనేక అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నట్లు అనేక ఫిర్యాదులొచ్చాయి. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టిఎ) ఈ పరీక్షల నిర్వహణా బాధ్యతలు చేపట్టింది. విద్యను ఉమ్మడి జాబితాలో మన రాజ్యాంగం పెట్టింది. కానీ విద్యను ఇలా కేంద్రీకృతం చేయడమనేది మన రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్ధం. రాష్ట్ర ప్రభుత్వాలను ఇలా పూర్తిగా పక్కనబెట్టడమనేది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు. ఇటీవల నిర్వహించిన నీట్‌ పరీక్షకు సంబంధించిన అంశాల్లో సరైన దర్యాప్తు జరగాలని సిపిఎం పొలిట్‌బ్యూరో డిమాండ్‌ చేసింది.

➡️