కేరళలో ముగిసిన ఎన్నికల ప్రచారం

ఎల్‌డిఎఫ్‌కు లభిస్తున్న ప్రజాదరణ !
కేరళ ఎన్నికల రౌండప్‌ !
తిరువనంతపురం : శుక్రవారం తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేరళ ఓటర్లు సమాయత్తమవుతున్న నేపథ్యంలో సిపిఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ఆశలు నెమ్మదిగా, గణనీయంగా పెరుగుతున్నాయి. గత 40రోజులుగా ఉధృతంగా సాగిన ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, మతోన్మాద పోకడలతో సహా వివిధ సమస్యలను తీవ్రంగా ప్రజల దృష్టికి తెస్తూ ఈ ప్రచారం సాగింది. ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ధులను గెలిపించుకోవడం ద్వారానే లౌకికవాదం, సమాఖ్యవాదం విలువలను పరిరక్షించుకోవాలన్న తమ ఆకాంక్ష నెరవేరగలదని ప్రజలు ఆశిస్తున్నారు.
ధరల పెరుగుదల, వ్యవసాయ సంక్షోభం , సిఎఎ, ఆర్టికల్‌ 370 రద్దు వంటి అంశాలపై వామపక్ష ఉద్యమాలు, పోరాటాలను ఎల్‌డిఎఫ్‌ ప్రధానంగా ప్రస్తావించింది. ‘వామపక్షాలు లేకపోతే భారతదేశం లేదు’ అన్న ఎల్‌డిఎఫ్‌ నినాదం ఓటర్లను ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, రాష్ట్ర కార్యదర్శి ఎం.వి.గోవిందన్‌ మాస్టర్‌, సిపిఎం నేతలు ప్రకాష్‌ కరత్‌, బృందా కరత్‌, సుభాషిణి అలీతో పాటు సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, రాష్ట్ర కార్యదర్శి వినరు విశ్వంతో సహా పలువురు ప్రముఖ నేతలు ఎల్‌డిఎఫ్‌ తరపున ప్రచారం సాగించారు. పార్లమెంట్‌ లోపల, వెలుపల ప్రజా వ్యతిరేక విధానాలపై, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడేది వామపక్షాలు మాత్రమేనని నేతలు స్పష్టం చేశారు. సామాన్యుల వాణిని వినిపించడానికి కట్టుబడి వున్నది, అలాగే మార్కెట్‌ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని, ఆహార ధాన్యాలు, ఎల్‌పిజి , ఇంధనాలు వంటి వాటితో సహా నిత్యావసరాల ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకునేలా ఒత్తిడి తేగలిగేది కూడా వామపక్షాలేనని నేతలు పేర్కొన్నారు.
2019 ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తంగా 20 స్థానాలకు గానూ యుడిఎఫ్‌ 19 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ ఎంపీల పేలవమైన పనితీరు చర్చకు వచ్చింది. సిఎఎ, ఎన్‌ఐఎ బిల్లులపై, రైతుల ఆందోళన వంటి అంశాలపై మోడీ ప్రభుత్వ నిష్క్రియాపరత్వంపై ప్రతి సభలోనూ చర్చించారు. యుడిఎఫ్‌లో బలమైన భాగస్వామి ముస్లిం లీగ్‌ను అవమానపరిచారు. రాహుల్‌ గాంధీ పోటీ చేసే వాయనాడ్‌ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వారి ఆకుపచ్చ జెండాలను తీసుకురావడం గానీ ఎగురవేయడం గానీ చేయరాదంటూ కాంగ్రెస్‌ ఆదేశాలు జారీ చేసింది. జెండాలు తీసుకువచ్చినందుకు ముస్లిం లీగ్‌ కార్యకర్తలపై కాంగ్రెస్‌ కార్యకర్తలు చేయి కూడా చేసుకున్నారు. 2019లో రాహుల్‌ గాంధీ ర్యాలీల్లో ఆకుపచ్చ జెండాలు చూసి వాటిని పాకిస్తాన్‌ జాతీయ పతాకాలుగా తప్పుగా అర్ధం చేసుకున్నారు.
వడక్కర నుండి పోటీ చేస్తున్న సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు కె.కె.శైలజపై సెక్సీ వ్యాఖ్యలతో అత్యంత హేయమైన రీతిలో జరిగిన సైబర్‌ దాడి కాంగ్రెస్‌ను రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా రక్షణలో పడేసింది. సైబర్‌ వేదికగా యుడిఎఫ్‌ కార్యకర్తలు ఒక మహిళా నేతపై చేసిన దాడి అనూహ్యమైనది, గతంలో కనివినీ ఎరుగనిది.
ఆరోగ్య మంత్రిగా పనిచేసే సమయంలో కోవిడ్‌, నిఫా వైరస్‌లను అత్యంత సమర్ధవంతంగా, సాహసోపేతమైన రీతిలో ఎదుర్కోవడంలో శైలజ చూపిన నేర్పు, ప్రతిభ అంతర్జాతీయంగా ప్రశంసలందుకున్నాయి.. తనపై జరిగిన సైబర్‌ దాడిని ఖండించడానికి పెట్టిన పత్రికా సమావేశంలో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. కాంగ్రెస్‌కు చెందిన ప్రత్యర్ధి షఫి పరాంబిల్‌పై ఆమె కేసు కూడా పెట్టారు.
సిట్టింగ్‌ ఎంపి వి.కె.శ్రీకందన్‌పై పాలక్కాడ్‌ నియోజకవర్గం నుండి సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎ.విజయరాఘవన్‌ భారీ విజయాన్ని నమోదు చేయడానికి సిద్ధమవుతున్నారు. పతనాంతిట్ట నియోజకవర్గంలో మూడుసార్లు ఎంపి అయిన ఆంటో ఆంటోనీకి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు డాక్టర్‌ థామస్‌ ఇజాక్‌ గట్టి పోటీనిస్తున్నారు. కాంగ్రెస్‌నేత ఎ.కె.ఆంటోనీ కుమారుడు అనీల్‌ ఆంటోనీ అక్కడ బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తుండడం కాంగ్రెస్‌ను ఇరకాటంలో పడేసింది. కేరళ ఆర్ధిక మంత్రిగా ఇజాక్‌ పనితీరే ఆయనను గెలిపిస్తుందన్న విశ్వాసాన్ని ఎల్‌డిఎఫ్‌ వ్యక్తం చేస్తోంది.
ఎల్‌డిఎఫ్‌కు గట్టి పట్టు వున్న అలతూర్‌ ఓటర్ల నుండి కేంద్ర కమిటీ సభ్యుడు, మంత్రి కె.రాధాకృష్ణన్‌కు మంచి స్పందన లభిస్తోంది. సిట్టింగ్‌ ఎంపి రమ్య హరిదాస్‌పై ఆయన పోటీ చేస్తున్నారు. పార్లమెంట్‌లో ఆమె పేలవమైన పనితీరు అందరికీ తెలిసినదే. కొజికోడ్‌లో కేంద్ర కమిటీ సభ్యులు, సిఐటియు నేత ఎలమరం కరీమ్‌ మూడుసార్లు ఎంపి అయిన ఎం.కె.రాఘవన్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు.
ఇతర ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ధులు ఎం.వి.బాలకృష్ణన్‌ మాస్టర్‌ (కాసర్‌గోడ్‌), ఎం.వి.జయరాజన్‌ (కన్నూర్‌), అనీ రాజా (వాయనాడ్‌), వి.వసీఫ్‌ (మలప్పురం), కె.ఎస్‌.హంసా(పొన్నై), వి.ఎస్‌.సునీల్‌ కుమార్‌(త్రిస్సూర్‌), సి.రవీంద్రనాథ్‌(చలక్కుడి), కె.జె.షైన్‌(ఎర్నాకులం), జాయిస్‌ జార్జి(కొట్టాయం), థామస్‌ చజికడన్‌(కొట్టాయం), ఎ.ఎం.అరిఫ్‌(అలప్పుజ), సి.ఎ.అరుణ్‌కుమార్‌(మవెలిక్కర), ఎం.ముకేష్‌(కొల్లామ్‌), వి.జారు(అత్తింగళ్‌), పన్నియన్‌ రవీంద్రన్‌(తిరువనంతపురం) బరిలో వున్నారు.

➡️