ముగిసిన నాలుగో దఫా చర్చలు ..

Feb 19,2024 09:10 #breaking, #Delhi Chalo, #discussions, #End, #four

న్యూఢిల్లీ : పలు డిమాండ్ల సాధనకై ఆందోళన చేపట్టిన రైతు సంఘాలతో కేంద్రం నాలుగో దఫా చర్చలు ముగిశాయి. ఆదివారం రాత్రి 8:15 గం. నుంచి సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట వరకు చర్చలు సాగాయి. ఈ చర్చల్లో కీలక ప్రతిపాదనను రైతు సంఘాల ముందు ఉంచినట్లు కేంద్రం ప్రకటించింది. అయితే నేడు, రేపు రైతు సంఘాలతో చర్చించి నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకొని ఒక నిర్ణయానికి వస్తామని రైతు నేత శర్వాన్‌ సింగ్‌ పంథేర్‌ చెప్పారు. రుణమాఫీ వంటి డిమాండ్లు ఇంకా అపరిష్కఅతంగానే ఉన్నాయన్నారు. దీనిపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు. ప్రస్తుతానికి ‘ఢిల్లీ చలో’ కార్యక్రమాన్ని నిలిపివేశామని.. ఒకవేళ తమ డిమాండ్లన్నింటికీ పరిష్కారం లభించకపోతే ఫిబ్రవరి 21న తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

పంజాబ్‌ – హర్యానా సరిహద్దుల్లోని శంభు వద్ద రైతుల ఉద్యమం ఆదివారం ఆరో రోజు కొనసాగింది. కుటుంబ సభ్యులతో కలిసి రైతులు నిరసనలో పాల్గొన్నారు. ఆదివారం చండీగఢ్‌లోని మహాత్మా గాంధీ స్టేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంజిఎస్‌ఐపిఎ) రైతు నాయకులతో కేంద్ర మంత్రులు నాలుగో విడత చర్చలు జరిగాయి. చర్చల్లో రైతు నేతలు కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా (కెఎంఎం) సమన్వయకర్త సర్వన్‌ సింగ్‌ పంధేర్‌, బికెయు ఏక్తా (సిధుపూర్‌) అధ్యక్షుడు జగ్జిత్‌ సింగ్‌ దల్లేవాల్‌ హాజరయ్యారు. కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్‌ ముండా, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌, కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్ పాల్గొన్నారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మన్‌ కూడా చర్చల్లో పాల్గొన్నారు. అంతకుముందు కేంద్ర మంత్రులు, పంజాబ్‌ సిఎం హోటల్‌ లో భేటీ అయి, రైతు ఆందోళనపై చర్చించారు. సమావేశానికి ముందు, పంధర్‌ మాట్లాడుతూ, తమకు ఆశ ఉందని, బంతి ఇప్పుడు కేంద్రం కోర్టులో ఉందని అన్నారు. కుటుంబాలతో రైతుల నిరసనకుటుంబ సభ్యులతో కలిసి రైతులు ఆదివారం ఆందోళనలో పాల్గొన్నారు. ఢిల్లీలోని శంభు సరిహద్దు వద్ద జరుగుతున్న ఆందోళనలో పాల్గొంటున్న మహిళా రైతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ, భోజన ఏర్పాట్లలో సహకరిస్తున్నారు. రైతు కుటుంబాలకు చెందిన మహిళలు తమ పిల్లలతో కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటు న్నారు. పంజాబ్‌లోని అమృతసర్‌, లూథియానా, ఫిరోజ్‌పూర్‌ ప్రాంతాల రైతులు ఎక్కువగా వచ్చారు.

➡️