మోడీ హయాంలో దిగజారిన ఎన్‌హెచ్‌ఆర్‌సి ప్రతిష్ట

Apr 30,2024 03:45 #dalithulu, #hrc, #modi
  •  ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, మైనార్టీలపై దాడులు జరుగుతుంటే చోద్యం చూస్తున్న కమిషన్‌
  •  రేపు జెనీవాలో యుఎన్‌హెచ్‌ఆర్‌సి సమీక్ష
  •  గ్రేడ్‌ తగ్గింపు గురించి సంకేతాలు

న్యూఢిల్లీ: రాజ్యాంగ సంస్థలను, ప్రజాస్వామిక వ్యవస్థలను ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేస్తున్న కేంద్రంలోని మోడీ పభుత్వం చివరికి జాతీయు మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సి)ని కూడా వదల్లేదు. ఆరెస్సెస్‌ భక్తులతో నింపేయడంతో ఆ కమిషన్‌ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారింది. గత పదేళ్లలో దేశంలో దళితులు, గిరిజనులు, మైనార్టీలు, మహిళలపై దాడులు పెరిగిపోయాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు బనాయించి జైలులో పెడుతున్నారు. గౌరి లంకేష్‌, దబోల్కర్‌, పన్పారే వంటివారిని దారుణంగా హత్యచేశారు. ఇంత జరుగుతున్నా జాతీయ మానవ హక్కుల కమిషన్‌ చోద్యం చూస్తూ కూర్చొందే తప్ప ఎలాంటి జోక్యం చేసుకోలేదు. ఎన్‌హెచ్‌ఆర్‌సి నిష్క్రియా పరత్వం వల్లే మానవ హక్కుల ఉల్లంఘనలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని హక్కుల కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ఐరాస మానవ హక్కుల సంస్థ (యుఎన్‌హెచ్‌ఆర్‌సి) పదే పదే హెచ్చరించినా ఎన్‌హెచ్‌ఆర్‌సి తీరు మారలేదు. ఈ ఏడాది మార్చి 26న అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌, హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌లతో సహా 9 మానవ హక్కుల గ్రూపులు జిఎఎన్‌హెచ్‌ఆర్‌ఐకి ఒక లేఖ రాశాయి. ఎన్నికల వేళ భారతదేశంలో పౌర సమాజంపై ఆంక్షలు పెరుగుతున్నాయని, మైనారిటీల పట్ల వివక్ష నెలకొందంటూ ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో బుధవారం జెనీవాలో జరగనున్న యుఎన్‌హెచ్‌ఆర్‌సి సమావేశంలో భారత్‌లో మానవ హక్కుల పరిస్థితి చర్చకు రానుంది. ఎన్‌హెచ్‌ఆర్‌సి గుర్తింపు రద్దు చేయడమో, లేక దాని గ్రేడ్‌ తగ్గించడమో చేస్తారన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే రెండు సార్లు ఎన్‌హెచ్‌ఆర్‌సిపై ఐరాస మానవ హక్కుల సంస్థ చర్యలు తీసుకుంది. 2016లో ఎన్‌హెచ్‌ఆర్‌సి గుర్తింపును వాయిదా వేసింది. 2023లో రేటింగ్‌ను నిలిపేసింది. రేటింగ్‌ తగ్గించే పరిస్థితి ఇలా ఎదుర్కోనాల్సి రావడం మోడీ ప్రభుత్వానికి ఇది రెండోసారి.
దేశంలో మానవ హక్కులను కాపాడడంలో పేలవమైన రికార్డు కలిగివున్న ఎన్‌హెచ్‌ఆర్‌సి తన వైఫల్యాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదు. మానవ హక్కులకు సంబంధించిన అంశాలపై దర్యాప్తుల్లో పోలీసు సిబ్బంది వుండడం, కమిటీల్లో మహిళలకు, మైనారిటీ ప్రాతినిధ్యం కొరవడడం వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి.
ఐక్యరాజ్య సమితి గుర్తింపు పొందిన గ్లోబల్‌ అలయన్స్‌ ఆఫ్‌ నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఇనిస్టిట్యూషన్స్‌ (జిఎఎన్‌హెచ్‌ఆర్‌ఐ) సబ్‌ కమిటీ బుధవారం నిర్వహించనున్న ఈ సమావేశానికి ఎన్‌హెచ్‌ఆర్‌సి అధికారులు నేరుగా కాకుండా ఆన్‌లైన్‌లో హాజరవుతారు.
1999లో గుర్తింపు పొందినప్పటి నుండి భారత్‌ 2006, 2011లో ఎ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. 2016లో గుర్తింపును వాయిదా వేశారు. ఏడాది తర్వాత పునరుద్ధరించారు. గతేడాది మార్చిలో ఎస్‌సిఎ ఆరు పాయింట్లతో తన అభిప్రాయాన్ని అందచేసింది. ”ప్రభుత్వ జోక్యంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా వ్యవహరించడానికి” అనువైన పరిస్థితులను నెలకొల్పడంలో ఎన్‌హెచ్‌ఆర్‌సి విఫలమైంది. దర్యాప్తు ప్రక్రియల్లో పోలీసు అధికారుల ప్రమేయం వుంటోందని, ఇది ఆశించిన ప్రయోజనాలకు విరుద్ధమని ఎస్‌సిఎ వ్యాఖ్యానించింది.
కమిషన్‌ సెక్రటరీ జనరల్‌, సిఇఓ బాధ్యతల్లో గుజరాత్‌ కేడర్‌ మాజీ ఐఎఎస్‌ అధికారి భరత్‌ లాల్‌తో సహా ప్రభుత్వ అధికారులు వుండడం వల్ల కమిషన్‌కు సమర్ధత పెరుగుతోందని ఎన్‌హెచ్‌ఆర్‌సి పేర్కొంది. అయితే దీనిని పౌర సమాజ కార్యకర్తలు తోసిపుచ్చారు. ఇప్పటికీ ఎన్‌హెచ్‌ఆర్‌సిలో చాలా మంది సభ్యులు పాలక పార్టీకి రాజకీయంగా విధేయులైన వారే ఉన్నారని, అన్నారు. వారిలో గుజరాత్‌లో బిజెపి ప్రతినిధిగా వున్న జాతీయ ఎస్‌సి కమిషన్‌ ఛైర్మన్‌ కిషోర్‌ మక్వానా, మధ్యప్రదేశ్‌ బిజెపి ఎంఎల్‌ఎ అయిన జాతీయ ఎస్‌టి కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ అంతార్‌ సింగ్‌ ఆర్య, మాజీ బిజెపి ఎంపి, జాతీయ వెనుకబడిన కులాల కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ హంసరాజ్‌ అహిర్‌, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యురాలు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ ప్రియాంక కనూంగు వున్నారు. భారతదేశ అక్రిడిటేషన్‌ హోదాపై వ్యాఖ్యానించడానికి విదేశాంగ శాఖ, ఎన్‌హెచ్‌ఆర్‌సిలు తిరస్కరించాయి. బుధవారం నాటి సమావేశంలో తిరిగి ‘ఎ’ హోదా పునరుద్ధరించబడుతుందన్న ధీమాతో ప్రభుత్వం ఉంది.

➡️