టార్గెట్‌ వంద

Apr 14,2024 23:45 #one hundred, #The target

99వ తడవ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా ‘ఉపాది’ కూలీ
ఆగ్రా : ఎన్నికల్లో వరుసగా పరాజయాల పాలైనా మళ్లీ 99వ సారి ఓ అభ్యర్థి పోటీ చేస్తున్నాడు. పేరు హన్నూరామ్‌ (78). ఈయన 1985లో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేశాడు. అప్పటి నుంచీ ఓడిపోయినా సరే వందవ సారి ఎన్నికల్లో పోటీ చేస్తానని చెబుతున్నాడు. వందసార్లు పోటీ చేయడమే తన లక్ష్యమని.. ఆ తర్వాత ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయనని చెప్పాడు. ఇంకో విశేషమేమిటంటే ఈ అభ్యర్థి ‘గ్రామీణ ఉపాధి’లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. తొలుత 1985 ఎన్నికల్లో ఆగ్రా జిల్లాలోని ఖేరాఘర్‌ నియోజకవర్గం నుండి బిఎస్‌పి అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆగ్రా, ఫతేపూర్‌ సిక్రి స్థానాల్లో పోటీకి నామినేషన్‌ దాఖలు చేయనున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘నాకు రాజకీయాలంటే ఆసక్తి. ఎన్నికల్లో పోటీ చేయడానికి 1984 చివరిలో నా ఉద్యోగాన్ని కూడా వదలిపెట్టాను. ఆ ఎన్నికల్లో నాకు ఖేరాఘర్‌ సీటుకు టికెట్‌ కచ్చితంగా ఇస్తానని బిఎస్‌పి హామీ ఇచ్చింది. కానీ ఇవ్వలేదు. పైగా పార్టీ కన్వీనర్‌ ‘నీకు నీ భార్యే ఓటు వేయదు. ఇక టికెట్‌ ఎందుకు? అని నన్ను అవమానించారు. అందుకే నేను 1985లో బిఎస్‌పి అభ్యర్థిపై ఇండిపెండెంట్‌గా పోటీ చేశాను. మూడో స్థానంలో నిలిచాను. ప్రజల నుంచి ఎలాగైనా ఓట్లు రాబట్టాలనే ఉద్దేశంతోనే వరుస ఎన్నికల్లో పోటీ చేశాను. అప్పటి నుండి గ్రామ ప్రధాన్‌, రాష్ట్ర అసెంబ్లీ, గ్రామ పంచాయితీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. అలాగే భారత రాష్ట్రపతి పదవికి కూడా నా అభ్యర్థిత్వాన్ని దాఖలు చేశాను. కానీ అది తిరస్కరించబడింది.’ అని ఆయన అన్నారు. తాను భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్‌ అంబేద్కర్‌ అనుచరుడినని చెప్పుకున్నారు. 1977 నుండి 1985 వరకు బ్యాక్‌వర్డ్‌ అండ్‌ మైనారిటీ కమ్యూనిటీస్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (బిఎఎంసిఇఎఫ్‌)తో సంబంధాలు కలిగి ఉన్నానని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి తన భార్య శివా దేవి (70), కుమారులు ఆర్థికంగా మద్దతు ఇస్తున్నారని హన్నూరామ్‌ అన్నారు. ఓటర్లను వ్యక్తిగతంగా కలుస్తానని, భౌతికంగా సంప్రదించలేని ఓటర్లకు ప్రత్యేకించి తాను చేత్తో రాసిన పోస్టు కార్డులను పంపుతానని చెప్పారు.

➡️