కేజ్రీవాల్‌ అరెస్టు- ఈసారి సిబిఐ వంతు

Jun 26,2024 23:54 #arrest, #Kejriwal

మూడు రోజుల కస్టడీకి అనుమతించిన కోర్టు
న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై కక్ష కట్టిన కేంద్రం ఆయనను మరో కేసులో అరెస్టు చేసింది. ఇప్పటికే ఇడి కేసులో అరెస్టయిన ఆయనను బుధవారం సిబిఐ మరోసారి అరెస్టు చేసింది. ఆ వెంటనే మూడు రోజుల సిబిఐ కస్టడీ విధిస్తూ స్పెషల్‌ జడ్జి అమితాబ్‌ రావత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రోజుకు 30 నిమిషాల పాటు లాయర్‌ను కలుసుకోవడానికి కేజ్రీవాల్‌కు అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం తీహర్‌ జైలుల్లో కేజ్రీవాల్‌ ఉన్నారు.
కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపర్చిన తర్వాత సిబిఐ తమ వాదనలు వినిపిస్తూ.. మద్యం దుకాణాలను ప్రైవేటీకరించాలని కేబినెట్‌ సహచరుడు (సిసోదియాను ఉద్దేశిస్తూ) సిఫార్సు చేశారని కేజ్రీవాల్‌ చెప్పినట్లు కోర్టుకు వెల్లడించింది.కేేజ్రీవాల్‌ తన వాదనలను స్వయంగా వినిపించారు. ఈ కేసులో మనీష్‌ సిసోడియా దానిని ఖండించారు. ఈ కేసులో తనను సిబిఐ గతేడాది సాక్షిగా విచారించిన విషయాన్ని కేజ్రీవాల్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు. మద్యం విధానానికి సంబంధించి తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అప్పుడే సిబిఐకి వెల్లడించినట్లు చెప్పారు.

సుప్రీంలో పిటిషన్‌ వెనక్కి.
బుధవారం తనను సిబిఐ అరెస్టు చేయడంతో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌ను సవరించేందుకు వీలుగా కేజ్రీవాల్‌ వెనక్కి తీసుకున్నారు. ఈ నెల 21న తనకు ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించడాన్ని సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ విచారణ బుధవారం జరగాల్సి ఉంది. పిటిసణ్‌ వెనక్కి తీసుకోవాలన్న కేజ్రీవాల్‌ అభ్యర్థనను సుప్రీంకోర్టు అనుమతించింది. హైకోర్టు పూర్తిస్థాయి ఆదేశాలు, సిబిఐ అరెస్టు వంటి కొత్త పరిణామాల నేపథ్యంలో సమగ్ర పటిషన్‌ను దాఖలు చేస్తామని ఆయన తరఫు న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ న్యాయస్థానాన్ని కోరారు.

➡️