Emergency : ఇందిరాగాంధీ మమ్మల్ని కటకటాల వెనక్కి నెట్టారు..కానీ ఎప్పుడూ దేశద్రోహులని దుర్భాలాషలాడలేదు : లాలూప్రసాద్‌ యాదవ్‌

Jun 29,2024 17:00 #Emergency, #Lalu Prasad Yadav, #modi

పాట్నా : భారతదేశ మాజీ ప్రధాని ఇందిరిగాంధీ 1975లో విధించిన ఎమర్జెన్సీ ‘ప్రజాస్వామ్యానికి నల్లని మచ్చ’ అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా ధ్వజమెత్తారు. ‘ఇంకెన్నాళుఎమర్జెన్సీ గురించి మాట్లాడతారు’ అంటూ ఖర్గే మండిపడ్డారు. తాజాగా కాంగ్రెస్‌ పాలనలో విధించిన ఎమర్జెన్సీ గురించి.. బిజెపి ప్రచారం చేయడంపై ఆర్‌జెడి నేత బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌ స్పందించారు. ‘ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మేము పోరాడినా.. ఇందిరాగాంధీ జైల్లో పెట్టించారు. కానీ ఆమె ఎప్పుడూ మమ్మల్ని దుర్బాలాషలాడలేదు. ప్రతిపక్షాలను గౌరవించేవారు’ అని లాలూ ప్రసాద్‌యాదవ్‌ అన్నారు. ఆయన ఈమేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇప్పుడు ఎమర్జెన్సీ గురించి విమర్శిస్తున్న బిజెపి, సంఘపరివార్‌లు ఆ సమయంలో సైలెంట్‌గా ఉన్నాయని లాలూ విమర్శించారు. ఎమర్జెన్సీ సమయంలో సంఘపరివార్‌ సైలెంట్‌గా ఉందని నళిన్‌ వర్మ అనే జర్నలిస్టు రాసిన కథనాన్ని కూడా లాలూ ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఈకథనాన్ని కూడా ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.
‘అప్పటి ప్రధాని ఇందిరిగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు జయప్రకాశ్‌ నారాయణ్‌ ఏర్పాటు చేసిన స్టీరింగ్‌ కమిటీకి నేను కన్వీనర్‌గా ఉన్నాను. అప్పుడు నేను 15 నెలలకు పైగా భద్రతా చట్టం (ఎంఐఎస్‌ఎ) కింద జైలులో ఉన్నాను. ఈరోజు ఎమర్జెన్సీ గురించి చాలామంది బిజెపి మంత్రులు మాట్లాడుతున్నారు. ఎమర్జెన్సీలో జైళ్లకు వెళ్లిన నాకు కానీ, నా సహచరులకు కానీ వీళ్లగురించి తెలియదు. మోడీ, జెపి నడ్డా, మోడీ మంత్రివర్గ సహచరుల గురించి మేము వినలేదు. ఈరోజు మాకు వీరంతా స్వేచ్ఛ, దాని విలువ గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారు.’ అని ఆయన ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు.
ఇందిరాగాంధీ మనలో చాలామందిని కటకటాల వెనక్కి నెట్టారు. కానీ ఆమె మమ్మల్ని ఎప్పుడూ దుర్భాలాషలాడలేదు. ఆమె కానీ, ఆమె మంత్రులు కానీ మమ్మల్ని ‘జాతీయ వ్యతిరేకులు’ లేదా ‘దేశభక్తి లేనివారు’ అని పిలవలేదు. మన రాజ్యాంగాన్ని రూపొందించిన బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ స్కృతిని అపవిత్రం చేయడానికి ఆమె విధ్వంసకారులను అనుమతించలేదు. 1975 ఎమర్జెన్సీ మన ప్రజాస్వామ్యానికి మచ్చే. కానీ అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ప్రతిపక్షాలను సైతం గౌరవించేవారు. అదే ఇప్పుడయితే 2024లో మోడీ కానీ, ఆయన మంత్రివర్గ సహచరులు ఎవరూ కూడా ప్రతిపక్షాలను గౌరవించడం లేదనేది మరిచిపోకూడదు.’ అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

➡️