నిత్య అన్వేషి థామస్‌ ఐజాక్‌

  • మంత్రిగా, ఎంఎల్‌ఎగా కేరళ ప్రజలకు విశేష సేవ
  • పత్తనంతిట్ట సిపిఎం ఎంపి అభ్యర్థి 

కేరళలోని పత్తనంతిట్ట లోక్‌సభ అభ్యర్థి టిఎం థామస్‌ ఐజాక్‌కి కొత్త విషయాలు తెలుసుకోవాలనే తపన, ఉత్సుకత ఎప్పుడూ ఉంటుంది. ఏ ప్రజా సమస్యనైనా కార్మిక వర్గ దృక్పథంతో చూస్తారు. జ్ఞాన సముపార్జన ఆయన జీవన విధానం. కాబట్టి ఉపాధ్యాయ-విద్యార్థి సంబంధం ఎల్లప్పుడూ ఆయన మనస్సులో ఉంటుంది. అందువల్ల దేశం అభివృద్ధి, ప్రజా సమస్యలలో కూడా అదే ఆలోచన, విశ్లేషణ ఉంటుంది.
సామాన్యుల కోణం
కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ బోర్డ్‌ (కెఐఎఫ్‌బిఐ)తో రాష్ట్రంలో రూ.80 వేల కోట్ల విలువైన డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పనకు కూడా ఆయన నాయకత్వం వహించారు. ఎకెజి స్టడీ రీసెర్చ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న మైగ్రేషన్‌ కాన్‌ క్లివ్‌ తో పాటు, పత్తనంతిట్ట జిల్లాలో ఐదు వేల మందికి ఉపాధి కల్పించేందుకు అవసరమైన చర్యలతో ముందుకు సాగుతోంది. 20 ఏళ్లుగా శాసన సభ్యుడిగా కొనసాగుతున్న థామస్‌ ఐజాక్‌, ఈ తడవ ఎన్నికల్లో తొలిసారిగా సిపిఎం నుంచి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పదేళ్లపాటు రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ప్లానింగ్‌ కమిటీ మెంబర్‌గా కూడా పనిచేశారు. ఆయన 2001-06లో మరారికుల్‌, 2011-16లో అలప్పుజ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. రెండు నియోజకవర్గాల్లోనూ లెక్కలేనన్ని వినూత్న అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. చేపట్టే ప్రాజెక్టులన్నీ సామాన్యులకు ఏ విధంగా మేలు చేకూరుస్తాయన్న దానిపైనే దృష్టి సారించారు.

పలు పథకాల రూపకర్త
వేలాది మంది గృహిణుల ఆర్థిక స్వావలంబనకు దారితీసిన ప్రాజెక్టులు కుటుంబశ్రీ, జానకీయసూత్రం వంటి వాటితో ప్రపంచ దేశాలు సైతం ఆశ్చర్యపోయేలా చేశారు. కేరళ అభివృద్ధి పథంలో ఈ బంగారు విజయాల వెనుక, టిఎం థామస్‌ ఐజాక్‌ ఉన్నారు. గొప్ప ఆర్థికవేత్తగా, ఉపన్యాసకునిగా, పలు గ్రంథాల రచయితగా, గొప్ప
నిర్వాహకుడిగా తనదైన ముద్ర వేసుకున్నారు.

ఆర్థిక వేత్త, మేధావి, రచయిత
మహారాజాస్‌ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్‌ తరువాత ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి ఆర్థికశాస్త్రంలో పిహెచ్‌డి చేశారు. ఆయన తిరువనంతపురంలోని సెంటర్‌ ఫర్‌ స్టడీస్‌లో ఫెలో కూడా ఉన్నారు. ఇప్పుడు సిడిఎస్‌, జిఐఎఫ్టిలో హానరరీ ఫెలోగా ఉన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు థామస్‌ ఐజాక్‌ ప్రస్తుతం సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడుగా ఉన్నారు.

  • జె.జగదీష్‌
➡️