సిపిఎం ఏజెంట్లపై టిఎంసి దాడులు

May 21,2024 09:17 #CPM agents, #TMC attacks
  • ప్రతిఘటించిన సిపిఎం అభ్యర్థులు
  • తృణమూల్‌పై తిరగబడ్డ ప్రజలు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పశ్చిమబెంగాల్‌లో సిపిఎం ఏజెంట్లను కూర్చోనివ్వకుండా టిఎంసి గూండాలు దాడులకు దిగారు. అలాగే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అధికార టిఎంసి ప్రయత్నించగా, టిఎంసి కుయుక్తులను ఎదురొడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణకు సిపిఎం అభ్యర్థులు పనిచేశారు. పశ్చిమ బెంగాల్‌లో శ్రీరాంపూర్‌ నియోజకవర్గంలో వివేకానంద ఇన్స్‌స్టిట్యూట్‌ బూత్‌ నెంబర్‌ 53 అధికార టిఎంసి బూత్‌ను కబ్జా చేసేందుకు ప్రయత్నించింది. సిపిఎం ఏజెంట్‌ను బూత్‌ నుంచి బయటకు నెట్టేశారు. ఓట్లను రిగ్గింగ్‌ చేసే ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు సిపిఎం అభ్యర్థి దీప్సితా ధర్‌ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అభ్యర్థిపై కూడా తిరగబడేందుకు టిఎంసి గూండాలు ప్రయత్నించారు. టిఎంసికి వ్యతిరేకంగా క్యూ లైన్‌లో నిలబడిన సాధారణ ఓటర్లు నిరసన తెలిపారు. ప్రజల ప్రతిఘటనను చూసి దొంగలు బూత్‌ను వదిలి పారిపోయారు. ఓట్ల రిగ్గింగ్‌ చేసేవారిని సామాన్య ప్రజలే తరిమికొట్టారు. శ్రీరాంపూర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో బంక్రా బూత్‌లో సిపిఎం ఏజెంట్‌ను టిఎంసి గూండాలు కూర్చోనివ్వలేదు. దీంతో సిపిఎం అభ్యర్థి దీప్సితా ధర్‌ ఏజెంట్‌తో కలిసి బంక్రా బూత్‌ నెంబర్‌ 203కి వెళ్లారు. బాంగ్రాలోని బూత్‌ నెంబర్‌ 143లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
హౌరా లోక్‌సభ నియోజకవర్గంలోని రాజ్‌ఖోలా జమాదర్‌ పరిసర ప్రాంతంలో అధికార పార్టీకి చెందిన గూండాలు సిపిఎం ఏజెంట్‌ను కొట్టి బయటకు తోసేశారు. నకిలీ ఓటర్లతో రిగ్గింగ్‌ మొదలైంది. విషయం తెలుసుకున్న సిపిఎం అభ్యర్థి సబ్యసాచి ఛటర్జీ అక్కడకు చేరుకుని బూత్‌లను పరిశీలించారు. అక్కడ టిఎంసి ఆగడాలను అడ్డుకున్నారు. జైరాంపూర్‌ మల్లిక్‌ పారాలో సిపిఎం ఏజెంట్లు కూర్చున్న క్యాంపు కార్యాలయాన్ని టిఎంసి గూండాలు ధ్వంసం చేశారు. సాధారణ ఓటర్లను కూడా అధికార టిఎంసి చంపేస్తామని బెదిరించింది. సిపిఎం అభ్యర్థి సబ్యసాచి ఛటర్జీ అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. పంచల కుశదంగా వద్ద బూత్‌ వెలుపల అక్రమంగా గుమిగూడి, ఓటర్లను ఓటు వేయకుండా అడ్డుకున్నారు. సిపిఎం అభ్యర్థి సబ్యసాచి ఛటర్జీ అక్కడకు చేరుకుని టిఎంసి గూండాలను అక్కడ నుంచి తరిమికొట్టారు. బరాక్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థి దేవదత్‌ ఘోష్‌ బూత్‌లను పరిశీలించారు. టిఎంసి, బిజెపిల భీభత్సం కారణంగా సామాన్యులు ఓటు హక్కును కోల్పోయారు. బరాక్‌పూర్‌లో సామాన్య ప్రజల ఓటు హక్కు కోసం సిపిఎం పోరాటం చేసింది.

➡️