నేడు కర్ణాటక తుది విడత ఎన్నికలు

May 7,2024 05:00 #2024 elction, #elections, #Karnataka

లోక్‌సభ మూడవ విడత ఎన్నికలు కర్నాటకలో మంగళవారం జరుగనున్నాయి. ఉత్తర కర్నాటకలోని 14 లోక్‌సభ స్థానాలకు నేడు ఎన్నికలు జరుగనున్నాయి. ఇక్కడ మొత్తం 28 లోక్‌సభ స్థానాలుండగా ఏప్రిల్‌ 26వ తేదీన దక్షిణ కర్నాటకలోని 14 లోక్‌సభ స్థానలకు ఎన్నికలు పూర్తయ్యాయి. ఉత్తర కర్నాటకలోని 14 లోక్‌సభ స్థానాలకు నేడు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు ఆదివారం సాయంత్రంతో ప్రచారాలు ముగిశాయి. పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఎన్నికలు జరుగుతున్న 14 స్థానాల్లోనూ మొత్తం 227 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్‌, బిజెపిల మధ్యనే ఉండనుంది. బిజెపి, జెడిఎస్‌ మిత్రపక్షంగా పోటీ చేస్తున్నప్పటికీ మూడవ విడత ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో బిజెపి ఒక్కటే పోటీలో ఉంది. 14 లోక్‌సభ స్థానాలకు కలిపి మొత్తం 2,59,52,958 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 1,29,48,978 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 1,29,66,580 మంది, ట్రాన్సు జెండర్లు 1935 మంది, 35,465 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. వీరందరూ నేడు జరగబోయే ఓటింగ్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాలు
మూడో విడత ఎన్నికలకు సంబంధించి ఉత్తర కర్నాటక ప్రాంతంలోని చిక్కోడి, బెల్గాం, బాగల్‌కోట్‌, బీజాపూర్‌, కల్‌బుర్గి, రాయచూర్‌, బీదర్‌ కొప్పల్‌, బళ్లారి, హవేరీ, ధార్వాడ్‌, ఉత్తర కన్నడ, దావణగెరె, షిమోగా, లోక్‌సభ స్థానాలున్నాయి. మూడవ విడతలో జరుగుతున్న ఈ లోక్‌సభ స్థానాల్లో ముఖ్యనేతలుండటంతో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎఐసిసి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సొంత నియోజకవర్గం కల్‌బుర్గి ఈ విడతలోనే ఎన్నికలు జరుగుతండగా, హవేరీలో మాజీ ముఖ్యమంత్రి బిజెపి నాయకులు బసవరాజు బొమ్మై బరిలోనున్నారు. షిమోగాలో మరో బిజెపి మాజీ ముఖ్యమంత్రి కుమారుడు రాఘవేంద్ర బరిలోనున్నారు. ఈయనకు వ్యతిరేకంగా బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వరప్ప బరిలో ఉన్నారు. ధార్వాడ్‌ నుంచి మాజీ కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి బరిలోనున్నారు. ఇలా ముఖ్యమైన నాయకులు మూడవ విడతలో బరిలోనుండటంతో ఎన్నికలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఈసారి బిజెపికి ఎదురుగాలే..
ఉత్తర కర్నాటక బిజెపికి మంచిపట్టున్న ప్రాంతంగా చెప్పుకునేవారు. 2019లో ఉత్తర కర్నాటకలోని 14 లోక్‌సభ స్థానాలను కూడా బిజెపి కైవసం చేసుకుంది. ఈసారి బిజెపికి అటువంటి పరిస్థితులు కనిపిండచం లేదు. గతంలో బిజెపికి అనుకూలంగానున్న లింగాయత్‌ సామాజికవర్గం ఈసారి వారి మద్దతు పెద్దగా ఉండే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికితోడు బిజెపి మిత్రపక్షంగానున్న జెడిఎస్‌ నాయకుడు ప్రజ్వల్‌ రేవణ్ణ సెక్స్‌ కుంభకోణం బయటకు రావడం బిజెపికి పూర్తి స్థాయిలో నష్టాన్ని చేకూరుస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఇకపోతే బిజెపి నేతల మధ్య కూడా సరైన సఖ్యత లేదు. గతంలో ఎన్నడూలేని విధంగా బిజెపి నేతల మధ్య గ్రూపు తగాదాలు ముదిరాయి. దీంతో ఈసారి లోక్‌సభ స్థానాలు అత్యధికం కోల్పోయే అవకాశాలే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

-షఫీవుల్లా

➡️