ప్రభు భక్తి పెరగడంపై వాసుదేవన్‌ విమర్శలు

Jan 12,2024 10:47 #cpm leaders, #kerala, #Pinarayi Vijayan
vasu devan comments on indidual identity

కొజికోడ్‌ : అధికారంలో వున్న రాజకీయ నేతలను ‘ఆరాధించడం’పై జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత ఎం.టి.వాసుదేవన్‌ నాయర్‌ తీవ్రంగా విమర్శించారు. మార్క్కిస్ట్‌ మేధావి, కేరళ మొదటి ముఖ్యమంత్రి ఇ.ఎం.ఎస్‌.నంబూద్రిపాద్‌ హయాంలో దీనికి వ్యతిరేకంగా ఆయన తీసుకున్న వైఖరిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కొజికోడ్‌లో నాలుగు రోజుల పాటు జరగనున్న కేరళ సాహితీ ఉత్సవాలను గురువారం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం కీలకోపన్యాసం చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారంలో వున్నవారు తమ పదవులను సామాజికాభివృద్ధి కోసం ఉపయోగించాలని ఆయన పిలుపిచ్చారు.ఇ.ఎం.ఎస్‌ చాలా గొప్ప, గౌరవనీయమైన నేత అని, 1957లో ఎన్నికల ద్వారా కమ్యూనిస్టు పార్టీకి దక్కిన అధికారమనేది ఒక అవకాశమని, ఆ పార్టీకి ఓటు వేసిన ప్రజలతో బాధ్యతాయుతమైన సమాజాన్ని నిర్మించేందుకై గొప్ప ఉద్యమాన్ని రూపొందించేందుకు ఇదొక ప్రారంభమని ఆయన భావించేవారని వాసుదేవన్‌ నాయర్‌ గుర్తు చేసుకున్నారు. సాహిత్యం పట్ల తన దృక్పథంలో తాను చేసిన తప్పులను ఆయన అంగీకరించినపుడు కొంతమంది ఆయన్ను ఎగతాళి చేశారని అన్నారు. ”రాజకీయాల్లో లేదా సామాజిక, సాంస్కృతిక రంగాల్లో మన ప్రముఖులు తప్పులు చేశామని భావించినపుడు వారి తప్పులను అంగీకరించడమనేది సాధారణంగా మనం వినని విషయం. అలాగే నేను కూడా ఇఎంఎస్‌ తన ప్రత్యర్ధులను ఎదుర్కొనడానికి వాదనల కోసం వెతుకుతున్నపుడు తన స్వంత అభిప్రాయాన్ని రూపొందించుకోవడాన్ని ప్రారంభించడం చూసి చాలా ఆశ్యర్యపోయాను. అభిప్రాయాలు రూపొందించుకోవడం ఆరంభించమని చెప్పడం గొప్ప విషయం, కానీ ఆయన తన శోధనలను ఎన్నడూ ఆపలేదు.” అని వాసుదేవన్‌ నాయర్‌ పేర్కొన్నారు. ‘కొంతమంది నేతలు’ చాలా మంది ఇతరులను నడిపించేందుకు ఎప్పుడూ నాయకత్వం వహిస్తారనే భావనను కూడా మార్చడానికి ఇఎంఎస్‌ చాలా ప్రయత్నించారని ఆయన గుర్తు చేసుకున్నారు. అందువల్లే నేతల పట్ల ప్రభుభక్తి ఆయనలో కనిపించదని అన్నారు. అంతకుముందు ప్రారంభోపన్యాసం చేస్తూ విజయన్‌, సాహితీ ఉత్సవాల్లో జరుగుతున్న ప్రసంగాలు, చర్చలు, సమాలోచనలు విజ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థగా కేరళ ఆవిర్బావానికి దోహదపడతాయని అన్నారు లౌకిక, ప్రగతిశీల, ప్రజాతంత్ర దృక్పథాన్ని యువత రూపొందించుకోవడానికి కూడా ఇవి దోహదపడతాయన్నారు.

➡️