డిఎండికే నేత, నటుడు విజయ్ కాంత్ కన్నుమూత

చెన్నై : డిఎండికే నేత, తమిళ నటుడు విజయ్ కాంత్(70) కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని మ్యాట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఈరోజు ఉదయం మృతి చెందారు. ఈ విషయాన్ని ఆరోగ్యశాఖ సెక్రటరీ అధికారికంగా ప్రకటించచారు. దీంతో తమిళ సినీ పరిశ్రమతో పాటు పార్టీ అభిమానులు, శ్రేణుల్లో విషాదంలో మునిగిపోయారు. హాస్పిటల్ వద్దకు భారీగా పోలీసుల మోహరించారు. 1952 ఆగస్టు 25న మధురైలో జన్మించిన విజయ్ కాంత్ తమిళ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు. దాదాపు 150 పైగా సినిమాలో నటించిన ఆయన 20 పైగా చిత్రాలలో పోలీస్ పాత్రలోనే నటించారు.  100వ చిత్రం ‘కెప్టెన్ ప్రభాకర్’ విజయవంతం తర్వాత కెప్టెన్ అని  ఆయన అభిమానులు పిలుస్తుంటారు. 2005 సెప్టెంబర్ 14న డిఎండికే పార్టీని స్థాపించారు. 2006లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన విజయ్ కాంత్ 2011లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.

విజయ్ కాంత్ నటించిన సినిమాలు

27 ఏళ్ల వయసులో విజయ్ కాంత్‌ తెరంగేట్రం చేశారు. ఆయన నటించిన తొలి సినిమా ‘ఇనిక్కుమ్‌ ఇలమై’ (1979). ప్రతినాయకుడి పాత్ర పోషించారు. అప్పటి నుంచి 2015 వరకు నిర్విరామంగా నటించారాయన. 3 షిఫ్టుల్లో పనిచేసేవారు. విజయ్ కాంత్‌.. ఎస్.ఎ.చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ‘దూరతు ఇడి ముళక్కం’, ‘సత్తం ఓరు ఇరుత్తరై’లతో విజయాలు అందుకున్నారు. ఆయన నటించిన సినిమాల సంఖ్య 150కి పైగానే. 1984లో ఆయన నటించిన 18 సినిమాలు విడుదలవడం విశేషం.ఆయన సినిమాలు తెలుగు, హిందీలో డబ్‌ అయి అక్కడా మంచి విజయాలు సాధించాయి. ‘శివప్పు మల్లి’ (ఎర్ర మల్లెలు రీమేక్‌), ‘జదిక్కొరు నీధి’ తదితర చైతన్యవంతమైన సినిమాల్లో నటించడంతో కోలీవుడ్‌లో ముందుగా ఆయన్ను ‘పురట్చి కలైంజ్ఞర్‌’ (విప్లవ కళాకారుడు) అనేవారు. తర్వాత అభిమానులంతా ‘కెప్టెన్‌ విజయకాంత్‌’గా పిలుచుకోవడం మొదలుపెట్టారు. పోలీసు అధికారిగా 20కి పైగా సినిమాల్లో కనిపించారు. ఆయన నటించిన ఆఖరి సినిమా ‘సగప్తం’ (2015).

 

➡️