కేంద్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంను ఆశ్రయిస్తాం : నవ కేరళం ముగింపు సదస్సులో పినరయి విజయన్‌

  • ఆర్థిక ఫెడరలిజానికి తూట్లు పొడుస్తోందంటూ విమర్శ
  • కేరళకు కేంద్రం బకాయిలు రూ. 64 వేల కోట్లు

తిరువనంతపురం : ఆర్థిక ఫెడరలిజానికి తూట్లు పొడుస్తూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తు న్న తీరుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా మని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ శక్రవారం వెల్లడించారు. తిరువనంతపురంలో నవకేరళం సదస్సు ముగింపు కార్యక్రమంలో విజయన్‌ ప్రసంగించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కేరళను ఆర్థికంగా అణగదొక్కుతోందని విమర్శించారు. కేంద్రం నుంచి ఇంకా రూ 64 వేల కోట్ల బకాయిలు రావాల్సిఉందనిఆయన వెల్లడించారు. కేరళకు జిఎస్‌టి పరిహారాన్ని నిలిపేయడం, రెవెన్యూ లోటు గ్రాంట్‌లో కోత పెట్టడం, రాష్ట్ర రుణ పరిమితిని కుదించడం వంటి చర్యల ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తోందని అన్నారు. అలాగే విభజన పూల్‌ నుంచి కేరళ ఆదాయ వాటాను తగ్గించిందని చెప్పారు. కేరళలో మెగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుల్లో కేంద్రం తన వాటాను నిలిపేసిందని అన్నారు. కేంద్రం ఇలాంటి ఆర్థిక ఆంక్షలను విధించడం వల్ల రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చేయడానికి కష్టపడుతున్నామని, 62 లక్షల మంది లబ్ధిదారులకు సంక్షేమ పించన్లు సత్వరమే చెల్లించాలని విజయన్‌ చెప్పారు. సమాఖ్య సూత్రాలను గౌరవించకుండా కేంద్రం చేస్తున్న సిగ్గులేని తిరస్కారాన్ని 36 రోజుల పాటు సాగిన నవకేరళ సదస్సు ద్వారా ప్రజలకు వెల్లడించామని తెలిపారు. రైట్‌వింగ్‌ కార్పొరేట్‌ మీడియా ప్రచారం చేస్తున్న అబద్ధాల తెరను తొలగించి, రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి ప్రజలకు వాస్తవాలను తెలియజేయడానికి నవకేరళ సదస్సు దోహదపడిందని అన్నారు. 140 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా నవ కేరళ సదస్సు యాత్ర సాగిందని చెప్పారు. కేరళను నాలెడ్జ్‌ ఎకానమీగా మార్చాలనే తమ ప్రభుత్వ ఆకాంక్షకు ప్రజల నుంచి భారీ మద్దతు లభించిందని అన్నారు. ‘కేరళకు రావాల్సిన వాటాను ఇవ్వకుండా తొక్కిపడుతున్న కేంద్ర ఆర్థిక మంత్రి అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక సంక్షోభానికి ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సంక్షేమ ఫించన్లు, ఇతర సామాజిక భద్రతా కార్యక్రమాలే కారణమని కేంద్ర మంత్రి బురదజల్లుతున్నారు’ అని విజయన్‌ విమర్శించారు.కేరళ మంత్రివర్గం నిర్ణయం మేరకు నవ కేరళ సదస్సు బస్సు యాత్ర నెల రోజుల క్రితం మంజేశ్వరంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే.

➡️