మోడీ విద్వేష ప్రసంగాలపై స్పందించరేం?

Apr 23,2024 08:11 #coments, #modi, #Sitaram Yechury
  • ఎన్నికల కమిషన్‌కు సీతారాం ఏచూరి మరో లేఖ 
  • ఈ ఫిర్యాదుపైనైనా స్పందించాలని విజ్ఞప్తి

న్యూఢిల్లీ : విద్వేష ప్రసంగాలు చేస్తూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న ప్రధాని నరేంద్ర మోడీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌కు లేఖ రాశారు. హిందూ, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఢిల్లీ ఎడిషన్లలోని మొదటి పేజీల్లో మోడీ ప్రసంగాలకు సంబంధించి వచ్చిన క్లిప్పింగ్‌లను కూడా ఆ లేఖతో పాటూ జతపరిచి పంపారు. బిజెపి చీఫ్‌గా నరేంద్ర మోడీ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలకు ప్రచారం చేస్తూ, రెచ్చగొట్టేలా అత్యంత విద్వేషపూరితమైన వ్యాఖ్యలు, ప్రసంగాలు చేసిన వార్తలు ఆ క్లిప్పింగ్‌ల్లో వున్నాయి.
రాజస్థాన్‌లోని బన్స్‌వాడాలో ఆదివారం బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తూ, ”మీరు ఎంతగానో కష్టపడి సంపాదించిన సొమ్మును మరింతమంది పిల్లలున్నవారికి, చొరబాటుదారులకు ఇచ్చేస్తారా?” అని పరోక్షంగా ముస్లింలను సూచిస్తూ ప్రశ్నించారు. ఈ మూడు వార్తాపత్రికల్లోనే కాకుండా మోడీ చేసిన ఈ ప్రసంగ వార్తలు ప్రధాన స్రవంతిలోని మీడియా, సోషల్‌ మీడియాలోనూ వచ్చాయి. నిర్దిష్టంగా ఏ కమ్యూనిటీనైనా లక్ష్యంగా చేసుకోవడం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 123(3)ని పూర్తిగా ఉల్లంఘించడమేనని ఎన్నికల కమిషన్‌ అంగీకరిస్తుంది. ఇవి కాకుండా, ప్రజా కార్యాచరణ, బూటకపు వార్తలు, మతాన్ని ప్రేరేపించడం, విద్వేష పూరితమైన ప్రసంగాలు చేయడం వంటి అంశాలపై రాజకీయ పార్టీలను హెచ్చరిస్తూ ఎన్నికల కమిషన్‌ ప్రతీసారీ సూచనలు జారీ చేస్తూనే వచ్చింది. తాజాగా మార్చి 1వ తేదీన కూడా ఇందుకు సంబంధించి సర్క్యులర్‌ జారీ చేసింది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను దారుణంగా ఉల్లంఘిస్తూ గతంలో జరిగిన సంఘటనల గురించి సిపిఎం ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకువచ్చిందని ఏచూరి ఆ లేఖలో గుర్తు చేశారు. ఇందుకు సంబంధించి ఫిర్యాదు చేస్తూ ఈ నెల 13న లేఖ రాశామని తెలిపారు. మతాన్ని ప్రేరేపిస్తూ, అయోధ్యలో రామాలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ ప్రతిపక్ష పార్టీలపై, నేతలపై తీవ్రమైన ఆరోపణలు చేశారని, వారిని రాముడికి వ్యతిరేకులుగా ముద్ర వేశారని పేర్కొంటూ అందుకు సంబంధించి మోడీ వివిధ సందర్భాల్లో చేసిన ప్రసంగాలను ఏచూరి ఆ లేఖలో ఉదహరించారు. ఈ ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్‌ స్పందన ఏమిటో ఇంతవరకు తమకు ఎలాంటి సమాచారం లేకపోవడం విచారకరమని ఏచూరి ఆ లేఖలో పేర్కొన్నారు. ఒక కమ్యూనిటీని ఉద్దేశించి విద్వేష ప్రసంగానికి పాల్పడడం చాలా దారుణమైనదని అన్నారు. ఇటువంటి విద్వేష ప్రసంగాలు చేసిన నేతలపై నిషేధాలు విధించిన ఘటనలు గతంలో వున్నాయని ఏచూరి గుర్తు చేశారు. ప్రధాని మోడీ చేసిన ప్రనంగాలపై తాజాగా చేసిన ఫిర్యాదును కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా ఎన్నికల కమిషన్‌ను ఏచూరి ఆ లేఖలో కోరారు. తక్షణమే మోడీపై, బిజెపిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మత విద్వేషాలను రెచ్చగొడుతున్నందుకు ప్రధాని మోడీపై ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయాల్సిన అవసరం వుందన్నారు. మరింతగా ఈ పరిస్థితులను దిగజార్చకుండా ఇటువంటి చర్చలు, ప్రసంగాలు నిలిపివేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
సరైన చర్యలు తీసుకోవడంలో ఎన్నికల కమిషన్‌ విఫలమైతే ఒక స్వతంత్ర ప్రతిపత్తి సంస్థగా ఇసి విశ్వసనీయతను ఇది మరింత దెబ్బతీస్తుందని, స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలు జరిగే వాతావరణాన్ని మరింత పాడు చేస్తుందని ఏచూరి ఆ లేఖలో పేర్కొన్నారు.

➡️