సంజయ్ సింగ్‌ లేని డబ్ల్యుఎఫ్‌ఐ మాకు ఆమోదమే : సాక్షి మాలిక్‌

 న్యూఢిల్లీ :   సంజయ్  సింగ్‌ లేకుండా రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యుఎఫ్‌ఐ) నూతన పాలకవర్గంతో తనకు ఎలాంటి సమస్యలు లేవని రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ బుధవారం స్పష్టం చేశారు. గతేడాది డిసెంబర్‌ 21న బ్రిజ్‌ భూషణ్‌ సన్నిహితుడు సంజయ్  సింగ్‌ డబ్ల్యుఎఫ్‌ఐ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్ర కటన వెలువడిన వెంటనే .. అతనిని వ్యతిరేకిస్తూ సాక్షి మాలిక్‌ రెజ్లింగ్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.  డబ్ల్యుఎఫ్‌ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ మద్దతుదారుల నుండి తన తల్లికి కూడా బెదిరింపు ఫోన్‌కాల్స్‌ వచ్చాయని తెలిపారు. తమ కుంటుంబ సభ్యుల్లో ఒకరిపై కేసు కూడా నమోదు చేస్తామని బ్రిజ్‌ భూషణ్‌ గూండాలు బెదిరిస్తున్నారని అన్నారు. సోషల్‌మీడియాలోనూ తమను దుర్భాషలాడుతూ పోస్ట్‌లు పెడుతున్నారని, అయితే వారి ఇళ్లల్లోనూ సోదరి, కుమార్తె ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. సంజయ్  సింగ్‌ను డబ్ల్యుఎఫ్‌ఐకి దూరంగా ఉంచినట్లైతే.. నూతన పాలకవర్గంతో తమకు ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. అడ-హక్‌ కమిటీతో తమకు ఎలాంటి సమస్యలేదని మీడియాకి తెలిపారు.

ప్రభుత్వం తమకు తల్లిదండ్రుల వంటిదని, రాబోయే యువ రెజ్లర్లకు రెజ్లింగ్‌ సురక్షితంగా ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నానని సాక్షి మాలిక్‌ పేర్కొన్నారు. సంజరు సింగ్‌ ఎలా ప్రవర్తిస్తున్నాడో మీరూ చూశారు కదా అని మీడియాని ప్రశ్నించారు. ఫెడరేషన్‌లో అతని జోక్యం తమకు ఇష్టంలేదని అన్నారు. అతనిని రెజ్లింగ్‌ చీఫ్‌గా తిరిగి తీసుకోమని కేంద్ర మంత్రిత్వ శాఖ స్పష్టం చేయాలని అన్నారు. డబ్ల్యుఎఫ్‌ఐ ఎన్నికల అనంతరం బ్రిజ్‌ భూషణ్‌ అధికార దుర్వినియోగాన్ని అందరూ చూశారని అన్నారు. తమ వలన రెజ్లర్లు బాధపడకూడదని అన్నారు. ఇప్పటికే అడహక్‌ కమిటీ సీనియర్స్‌ క్రీడలను ప్రకటించిందని, అండర్‌ 15, అండర్‌ 17, అండర్‌ 20 జూనియర్స్‌ క్రీడలను కూడా ప్రకటించాలని అడహక్‌ కమిటీని కోరారు. స్పోర్ట్స్‌ అడ్మినిస్ట్రేటర్‌గా మారుతున్నారా అన్న మీడియా ప్రశ్నను తోసిపుచ్చారు. తమ వలన ఓ ఏడాది కోల్పోయామని జూనియర్‌ రెజ్లర్లు తమని నిందిస్తున్నారని, అయితే అది సరికాదని అన్నారు. వారి భవిష్యత్తు కోసమే తాము పోరాడుతున్నామని అన్నారు.

  • జూనియర్‌ రెజ్లర్ల ఆందోళన

కాగా, వందలాది మంది జూనియర్‌ రెజ్లర్లు బుధవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ఆందోళన చేపట్టారు. సీనియర్‌ రెజ్లర్లు బజరంగ్‌ పూనియా, సాక్షిమాలిక్‌, వినేష్‌ ఫోగాట్‌ల కారణంగా తమ కెరీర్‌లో ఒక ఏడాదిని కోల్పోయామని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌, హర్యానా మరియు ఢిల్లీల నుండి బస్సుల్లో వందలాది మంది జూనియర్‌ రెజ్లర్లు జంతర్‌మంతర్‌ చేరుకున్నారు. వీరిలో సుమారు 300 మంది ఛప్రౌలీ, బాగ్‌పట్‌లోని ఆర్యసమాజ్‌ అఖారా నుండి, అలాగే నరేలాలోని వీరేదర్‌ రెజ్లింగ్‌ అకాడమీ నుండి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. బజరంగ్‌పునియా, సాక్షి మాలిక్‌, వినేష్‌ ఫోగాట్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘ఈ ముగ్గురు రెజ్లర్ల నుండి తమ రెజ్లింగ్‌ను యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (యుడబ్లుడబ్ల్యు) కాపాడాలి’ అని ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో ఆప్రాంతమంతా భారీగా భద్రతా దళాలను మోహరించారు.

మహిళా రెజ్లర్లపై బ్రిజ్‌భూషన్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ బజ్‌రంగ్‌ పూనియా, సాక్షిమాలిక్‌ , వినేష్‌ ఫోగాట్‌ సహా పలువురు రెజ్లర్లు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో జనవరి 2023 నుండి, డబ్ల్యుఎఫ్‌ఐ రెండు సార్లు సస్పెండ్‌ చేయబడింది. అడహక్‌ కమిటీ ( తాత్కాలిక ప్యానెల్‌) కార్యకలాపాలను నిర్వహిస్తోంది. దీంతో నేషనల్స్‌, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలు నిలిచిపోయాయి.

➡️