క్రైస్తవ స్వచ్ఛంద సంస్థ డబ్ల్యువిఐపై కొరడా ఝళిపించిన కేంద్రం

న్యూఢిల్లీ  :    చిన్నారుల సమస్యలపై దృష్టి సారించే క్రైస్తవ స్వచ్ఛంద సంస్థ (ఎన్‌జిఒ) వరల్డ్‌ విజన్‌ ఇండియా (డబ్ల్యువిఐ)పై కేంద్రం కొరడా ఝళిపించింది. భారత్‌లో గత 70 ఏళ్లుగా పనిచేస్తున్న ఈ సంస్థకు విదేశీ నిధులు అందకుండా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఎ) నిలిపివేసింది. అమెరికాకు చెందిన ఈ సంస్థ ప్రపంచంలోని వంద దేశాలలో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అతిపెద్ద క్రైస్తవ స్వచ్ఛంద సంస్థలలో ఒకటైన ఈ సంస్థకు విదేశీ సహకార నియంత్రణ చట్టం (ఎఫ్‌సిఆర్‌ఎ) రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది.

ఎఫ్‌సిఆర్‌ఎ నిబంధనలను ఉల్లంఘించినందున రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తున్నందున డబ్ల్యువిఐకి మాతృసంస్థ సహా ఇతర విదేశీ విరాళాలను స్వీకరించేందుకు అర్హత లేదు అని ఎంహెచ్‌ఎ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఎఫ్‌సిఆర్‌ఎ 1986 కింద డబ్ల్యువిఐ నమోదైన ఈ సంస్థ.. విదేశీ నిధులతో భారత్‌లో ‘ సామాజిక, విద్య ‘ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ సంస్థ గతంలో పలు ప్రభుత్వ శాఖలతో ఒప్పందం కూడా చేసుకుంది. అయితే సోషల్‌ మీడియాలో వివాదాలు వెల్లువెత్తడంతో 2016లో ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌ (ఐసిడిఎస్‌)పై డబ్ల్యువిఐ సంతకం చేసిన అవగాహనా ఒప్పందాన్ని రాజస్థాన్‌ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఎఫ్‌సిఆర్‌ఎ రిజిస్ట్రేషన్‌ పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకున్న ఏడాది తర్వాత ఈ సంస్థ రిజిస్ట్రేషన్‌ను 2022 నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది.

ఎఫ్‌సిఆర్‌ఎ నిబంధనలు పాటించడంలేదని ఆరోపిస్తూ మంత్రిత్వ శాఖ మొదట 180 రోజుల పాటు నిలిపివేసింది. అనంతరం గతేడాది మేలో సస్పెన్షన్‌ను పొడిగించింది. దీంతో ఉద్యోగులు, విక్రేతలకు నవంబర్‌ 22 నుండి మార్చి 23 మధ్య కాలానికి సంబంధించి రూ.39.72 కోట్లను చెల్లించాల్సి వచ్చింది. వీటికోసం 25 శాతం నిధులకు ఆస్తులను అనుమతించాలంటూ దరఖాస్తు చేసుకుంది.

➡️