ఓటుపై యువత అనాసక్తి

May 11,2024 23:41 #not interested, #Voting, #youth

– రాజకీయపార్టీలు, వారి వాగ్దానాలపై అసంతృప్తి
– ముఖ్యంగా పట్టణ ఓటర్లు దూరం
న్యూఢిల్లీ : దేశంలో యువత ఓటు చాలా కీలకం. దేశ భవిష్యత్తును నిర్ణయించటంలో వారి ఓటు హక్కు పెను మార్పును తీసుకొస్తుంది. కానీ, ఆ యువత తన బాధ్యతను విస్మరిస్తున్నది. ఓటు హక్కుకు దూరంగా ఉంటూ అసమర్థ నాయకులు పాలకులవ్వటానికి పరోక్షంగా కారణమవుతున్నదని మేధావులు, విశ్లేషకులు అంటున్నారు. కొన్ని గణాంకాల ప్రకారం.. 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 50 శాతం జనాభాతో భారత్‌ ‘యువ దేశం’గా ఉన్నది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో యువత గణనీయమైన పాత్ర పోషిస్తుందనటంలో ఎలాంటి సందేహమూ లేదని వారు అంటున్నారు.
దేశవ్యాప్తంగా 2024 ఎన్నికల కోసం 18ా19 సంవత్సరాల మధ్య వయస్సు గల ఓటర్లలో 40 శాతం కంటే తక్కువ మంది తమ ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నారని భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) డేటాను విడుదల చేసింది. ఢిల్లీ, బీహార్‌, యూపీలలో అత్యల్ప నమోదు రేట్లు ఉన్నాయి. అయితే, ఇది ప్రజాస్వామ్య దేశానికి చాలా ప్రమాదకరమని మేధావులు అంటున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో.. బిజెపికి యువ ఓటర్ల నుంచి వచ్చిన ఓట్లు 41 శాతం. ఇది 2014 లోక్‌సభ ఎన్నికల కంటే ఏడు శాతం ఎక్కువ. దీంతో యువ ఓటర్లు బిజెపి విజయంలో కీలక పాత్ర పోషించారని తెలుస్తున్నది. డెక్కన్‌ హెరాల్డ్‌ నివేదిక ప్రకారం.. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలకు చెందిన యువత ఎన్నికలపై తక్కువ ఆసక్తి చూపుతున్నారని ఈసీఐ తెలిపింది. యువకులు తమ స్వగ్రామాల నుంచి తరలివెళ్లిన అంతర్గత వలసలు.. ఓటర్ల సంఖ్య లేకపోవటానికి ప్రధాన కారణమని విశ్లేషకులు గుర్తించారు. 18ా27 సంవత్సరాల మధ్య వయస్సు గల కొంతమంది నమోదిత, నమోదు కాని యువ ఓటర్లు చాలా మంది అంతర్గత వలసలను ప్రధాన కారణంగా చెప్పారు. అయితే ఈ సంవత్సరం లోక్‌సభ ఎన్నికలలో కూడా కీలక రాజకీయ పార్టీల వారు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే సార్వత్రిక ఎన్నికల్లో యువ ఓటర్లు తప్పక పాల్గనాలని నిపుణులు, మేధావులు సూచిస్తున్నారు. యువ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటే సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవచ్చనీ, అది కాదని ఉన్నత విద్యను అభ్యసిస్తున్న యువత సైతం ఓటుపై అనాసక్తిని వ్యక్తం చేయటం చాలా బాధాకరమని చెప్తున్నారు. ఓటు హక్కుపై అవగాహనా కార్యక్రమాలను మరింత ఉధృతం చేయాలని అంటున్నారు.

➡️