అంగన్‌వాడీలపై ఎస్మా రద్దు చేయకపోతే ప్రభుత్వాన్ని సాగనంపుతారు : సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు

  • అవసరమైతే రాష్ట్ర బంద్‌ చేపడతామని హెచ్చరిక

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అంగన్‌వాడీలపై ప్రయోగించిన ఎస్మాను రద్దు చేయకపోతే ప్రభుత్వాన్ని ప్రజలే ఇంటికి పంపిస్తారని, లక్షమంది మహిళల పట్ల అమానుషంగా వ్యవహరించిన ఈ ప్రభుత్వాన్ని సాగనంపే వరకూ ఊరుకునేది లేదని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె 26వ రోజుకు చేరిన సందర్భంగా ధర్నా చౌక్‌లోని దీక్షా శిబిరానికి ఆదివారం వివిధ రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌, న్యూడెమొక్రసీ, అమ్‌ఆద్మీ, ఎంఎల్‌ పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా బి.వి.రాఘవులు మాట్లాడుతూ అక్కా చెల్లెమ్మలు అంటూ ఓట్లు పొంది అధికారంలోకి వచ్చిన తరువాత లక్షమంది అంగన్‌వాడీలకు అన్యాయం చేశారని విమర్శించారు. ఐసిడిఎస్‌ను అత్యవసర సర్వీసుగా పరిగణించామని ఎస్మా జిఓ ఇచ్చారని, అలాంటప్పుడు 26 రోజుల నుండి వారి సమస్యలు పరిష్కరించకుండా ఎందుకున్నారని ప్రశ్నించారు. ఎస్మా ప్రయోగించడం ద్వారా అంగన్‌వాడీలను బెదిరించి లొంగదీసుకోవాలనుకున్నారని, అది సాధ్యమయ్యే పనికాదని తెలిపారు. అలాగే అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగుకొట్టించడం, వలంటీర్లు, గ్రామ, వార్డు కార్యదర్శులతో నడుపుతామని రకరకాల పేర్లతో వారిని బెదిరించే పనికి దిగారని అన్నారు. చర్చల పేరుతోనూ సమస్యలు పరిష్కరించకుండా బెదిరించారని విమర్శించారు. దొంగలు లూటీ చేసే విధంగా కార్యాలయాల తాళాలు పగుకొట్టించి ఉద్యోగులు, సిబ్బంది మధ్య ఘర్షణ పెట్టేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎవరూ బెదిరిపోరని అన్నారు. సాధికారయాత్ర పేరుతో ఊరూరా తిరుగుతున్నారని, లక్షమంది మహిళల గురించి పట్టించుకోని సిఎం ఏం సాధికారత సాధిస్తారని ప్రశ్నించారు. ప్రజలతో మాట్లాడని సిఎం ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేలను ట్రాన్స్‌ఫర్‌ చేసే పని పెట్టుకున్నారని తెలిపారు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలతోపాటు, భవిష్యత్‌లో జరగబోయే ఎన్నికల్లో సీటు ఆశించే వారికి కూడా అంగన్‌వాడీలు తగు హెచ్చరికలివ్వాలని సూచించారు. హైదరాబాద్‌లో కెసిఆర్‌ను పరామర్శిందుకు సమయం ఉన్న సిఎంకు అంగన్‌వాడీలతో గంట సమయం మాట్లాడేందుకు అవకాశం లేకపోవడం బాధాకరమని తెలిపారు.

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ 26 రోజుల నుండి సమ్మె చేస్తున్నా ఏమీ తెలియనట్లు సిఎం వ్యవహరించడం దౌర్భాగ్యమన్నారు. సీట్లు, ఓట్లు, అధికారం, అమ్ముకోవడం తప్ప సిఎంకు మరేమీ పట్టడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని దివాళా తీయించారని విమర్శిస్తే ఆర్థిక పరిస్థితి బాగుందని చెబుతున్న ప్రభుత్వం జీతాలు పెంచమంటే మాత్రం బాగోలేదని చెబుతోందని, ఒకేసారి రెండు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ నిరంకుశ విధానాలపై సోమవారం రాజకీయ పార్టీలతో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నామని తెలిపారు. కాంగ్రెస్‌ నాయకులు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేస్తున్నా అంగన్‌వాడీ మహిళల్లో భయం నిరాశ లేవని పేర్కొన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు ఫణిరాజు మాట్లాడుతూ మహిళలు చేస్తున్న పోరాటంలో న్యాయం ఉందని, అందువల్లే ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోతున్నాయని తెలిపారు. అంగన్‌వాడీలతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ నిలబడలేదని తెలిపారు. సిపిఐ (ఎంఎల్‌) పార్టీ రాష్ట్ర నాయకులు జాస్తి కిషోర్‌బాబు మాట్లాడుతూ ప్రజలతో సంబంధం లేదని పాలన సాగించిన జగన్మోహన్‌రెడ్డి తాడేపల్లి ప్యాలెస్‌కు పరిమితం అయ్యారని, ప్రజలు కూడా అతన్ని సాగనంపి ప్యాలెస్‌కు పరిమితం చేస్తారని హెచ్చరించారు. న్యూడెమెక్రసీ నాయకులు మల్లిఖార్జునరావు మాట్లాడుతూ ఉద్యమాలను తేలికగా తీసుకున్న ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేకపోయిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు, వి.ఉమామహేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కె.ధనలక్ష్మి, డి.వి.కృష్ణ, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు, అనుబంధ సంఘం నాయకులు జె.లలిత, ఐఎఫ్‌టియు నాయకులు పొలారి, రవిచంద్ర, సిఐటియు అనుబంధం అంగన్‌వాడీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బేబీరాణి, ఉపాధ్యక్షులు ఎన్‌సిహెచ్‌.సుప్రజ, కెవిపిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నరహరిశెట్టి నరసింహారావు, జైభారత్‌ పార్టీ నాయకులు పోతిన రామారావు తదితరులు పాల్గొన్నారు.

➡️