అనపర్తిలో ఉద్రిక్తత

Mar 28,2024 22:41
అనపర్తిలో ఉద్రిక్తత

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి, బిక్కవోలుటిడిపి నాయకులు, కార్యకర్తల నిరసనలతో అనపర్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పొత్తులో భాగంగా అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ సీటను బిజెపికి కేటాయించడంతో టిడిపి కార్యకర్తలు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. బుధవారం రాత్రి నుంచి మొదలైన ఆందోళనలు గురువారం తారాస్థాయికి చేరుకున్నాయి. టిడిపి పోస్టర్లు, జెండాలు, ఆ పార్టీ సింబల్‌ అయిన సైకిల్‌ను దహనం చేశారు. కార్యకర్తలను నిలువరించేందుకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆయన తనయుడు మనోజ్‌ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి నల్లమిల్లి మాట్లాడారు. కార్యకర్తలు ఆందోళన చెందొద్దంటూ పిలుపునిచ్చారు. తనకు టికెట్‌ రాకుండా పెద్దకుట్ర జరిగిందనితనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించనున్నట్లు స్పష్టం చేశారు. ఓ దశలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రజల నిర్ణయం మేరకు ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు. టిడిపికి మద్దతు ఇవ్వబోనని, బిజెపికి ఓటు వేయమని చెప్పబోనని స్పష్టం చేశారు. నియోజక వర్గంలో ఏ మాత్రం బలం లేని బిజెపికి ఎలా సీటు కేటాయిస్తారని ప్రశ్నించారు. ఫలించని చంద్రబాబు మంత్రాంగం నల్లిమిల్లిని రామకృష్ణారెడ్డిని బుజ ్జగించేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నం విఫలయత్నమైంది. చంద్రబాబు నల్లమిల్లికి ఫోన్‌ చేసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. రామకృష్ణారెడ్డి నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నియోజక వర్గ పరిస్థితిని, కార్యకర్తల ఆవేదనను వివరించారు. అక్రమ కేసులు ఎదుర్కొని పార్టీ కోసం ప్రాణాలొడ్డి పనిచేశానని తెలిపారు. గతంలో వైఎస్‌ఆర్‌ పిలిచినా పార్టీని వీడలేదని తెలిపారు. తమరి కోసం తెగించి పోరాడిన కొద్ది మందిలో తాను ఒకడినంటూ గుర్తు చేశారు. కుటుంబ సమేతంగా ప్రజల ముందుకు వెళ్తా…కుటుంబ సమేతంగా ప్రజల ముందు కు వెళ్లి తనకు తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించి ప్రజల మద్దతు కోరతానని రామకష్ణారెడ్డి తెలిపారు. ఐదేళ్లలో వైసిపి తనపై ఎన్ని కుట్రలు చేసినా మట్టు బెట్టాలని చూసినా, తనపై 39 కేసులు, కార్యకర్తలపై 200 సుమారు కేసులు పెట్టినా వెనకడుగు వేయలేదని గుర్తు చేశారు. టిడిపి కోసం అహర్నిశలు కష్టపడ్డానని అలాంటి తనకు టిక్కెట్టు ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం అన్నారు. తనకు టికెట్‌ రాకుండా ప్రస్తుత అనపర్తి ఎంఎల్‌ఎ డాక్టర్‌ సత్తి సూర్యనారాయణ రెడ్డి బావమరుదులు పనిచేశారన్నారు. టిడిపిలో తన కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు.

➡️