అసైన్డ్‌ భూములకూ పరిహారం, నష్టపరిహారం చెల్లించాలి- హైకోర్టు కీలక తీర్పు

Jan 6,2024 21:48 #AP High Court, #judgement

ప్రజాశక్తి, అమరావతిప్రభుత్వం నుంచి అసైన్మెంట్‌ కింద డికెటి పట్టాలు పొంది భూములు సాగు చేసుకుంటున్న రైతులు పరిహారంతో పాటు నష్ట పరిహారానికి కూడా అర్హులేనని హైకోర్టు తీర్పు చెప్పింది. ప్రజా అవసరాల కోసం అలాంటి భూములు తీసుకున్నప్పుడు ప్రయివేటు భూ యజమానికి చెల్లించే విధంగానే వారికి కూడా పరిహారంతో పాటు నష్ట పరిహారం కూడా చెల్లించాలని చెప్పింది. ప్రయివేటు భూముల యజమానులు ఏ విధంగా అయితే నష్ట పరిహారానికి, ఇతర ప్రయోజనాలకు అర్హులో, అసైనీలు కూడా అదే స్థాయిలో అర్హులని తేల్చి చెప్పింది. కామన్‌ జాయింట్‌ ఫార్మింగ్‌ స్కీం (సిజెఎఫ్‌ఎస్‌) భూములు పొందిన వారు కూడా డికెటి పట్టాదారులతో సమానంగా నష్ట పరిహారానికి అర్హులంది. అసైన్మెంట్‌ కింద ఇచ్చిన పట్టా తాత్కాలికం కాబట్టి ఎక్స్‌గ్రేషియా చెల్లింపునకు అర్హులు కాదన్న ప్రభుత్వ వాదనను కొట్టివేసింది.తెలుగు గంగ ప్రాజెక్టులో భాగమైన కండలేరు రిజర్వాయర్‌ వల్ల భూములు కోల్పోయిన అసైనీలకు ఇతర భూ యజమానులతో సమానంగా నష్ట పరిహారం, ఇతర ప్రయోజనాలన్నింటినీ కల్పించాలని తీర్పు చెప్పింది. ఈ మేరకు గతంలో సింగిల్‌ చేయించిన తీర్పును డివిజన్‌ పెంచి ఆమోదించింది. సింగిల్‌ జడ్జి తీర్పును కొట్టేయాలని కోరుతూ తెలుగు గంగ ప్రాజెక్టు భూ సేకరణ స్పెషల్‌ కలెక్టర్‌ దాఖలు చేసిన అప్పీల్‌ పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ రావు రఘునందన్‌ రావు లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ గురువారం తీర్పు చెప్పింది. నెల్లూరు జిల్లా, రాపూరు మండలం, గుండవోలు గ్రామానికి చెందిన మద్దె రామయ్య మరో ముగ్గురికి1978లో 6.19 ఎకరాల భూమిని అసైన్‌ మెంట్‌ కింద ఇచ్చారు. కండలేరు రిజర్వాయర్‌ నిర్మాణం ఆ 6.19 ఎకరాల భూమిని అధికారులు సేకరించారు. అసైన్డ్‌ భూములు కాబట్టి ఆ భూములకు అధికారులు నష్టపరిహారం చెల్లించకపోవడంతో వారు 2009లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 2022లో హైకోర్టు సింగిల్‌ జడ్జి వాళ్ళ పిటిషన్లను అనుమతించి నష్టపరిహారం, పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పారు. దీనిపై దాఖలైన అప్పీల్‌ పిటిషన్‌ ను ద్విసభ్య ధర్మాసనం కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.

➡️