ఆరు గ్యారంటీల అమలుపై చేతులెత్తేసిన సీఎం రేవంత్‌: కేటీఆర్‌

Feb 2,2024 15:25 #KTR, #speech

హైదరాబాద్‌: ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్‌ రెడ్డి చేతులెత్తాశారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తేనే గ్యారంటీలను అమలు చేస్తామంటున్నారని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేది లేదు, గ్యారెంటీలు అమలు చేసేది లేదని చెప్పారు. ఆ పార్టీకి గతంలో వచ్చిన సీట్లు కూడా రావన్నారు. ఇండియా కూటమిలో ముఖ్యమైన పార్టీలు వెళ్లిపోయాయని తెలిపారు. ఘట్‌కేసర్‌లో నిర్వహించిన మేడ్చల్‌ నియోజకవర్గ విజయోత్సవ సభకు కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి చెక్‌ పెట్టాలన్నారు. కేంద్రంలో బీజేపీని అడ్డుకోగలిగేది ప్రాంతీయ పార్టీలేనని స్పష్టం చేశారు.అప్పు తెచ్చుకోండి రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తామన్నారు. ఇప్పుడ ఆ హామీ ఎటుపోయింది?. ఆడబిడ్డలకు నెలకు రూ.2500 ఇస్తామన్నారు. వాటికోసం కోటి 57 లక్షల మంది ఆడబిడ్డలు వేచి చూస్తున్నారు. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలు జుట్లు పట్టుకుంటున్నారు. ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డునపడ్డారు. కడుపు కాలిన ఆటోడ్రైవర్‌ ప్రజాభవన్‌ ముందు ఆటో కాలబెట్టాడు.లంకె బిందెల కోసం వెతికే వారు అధికారంలోకి వచ్చారు. సెక్రటేరియట్‌లో కంప్యూటర్లు, జీవోలు ఉంటాయి.. లంకె బిందెలు ఉండవు. లంకెబిందెల కోసం వెదికేది ఎవరో ప్రజలకు తెలుసు. ప్రతి హామీని నెరవేర్చే వరకు ప్రజల తరపున పోరాడుతాం. కాంగ్రెస్‌ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కాదు.. 420 హామీలు. కాంగ్రెస్‌ అబద్ధాలపై అసెంబ్లీ వేదికగా ఎండగట్టినం. బీఆర్‌ఎస్‌ ఎంపీలుంటేనే పార్లమెంటులో మన వాణి వినిపిస్తరు. కేసీఆర్‌ సీఎం కాలేదని జనం బాధపడుతున్నరు’ అని కేటీఆర్‌ అన్నారు.

➡️