ఎంపిల సస్పెన్షన్‌ అప్రజాస్వామ్యం

Dec 23,2023 09:04 #Dharna, #left parties

– పార్లమెంట్‌ చరిత్రలో చీకటి అధ్యాయం

– దేశానికి భద్రత కల్పించడంలో విఫలం

– మోడీ అమిత్‌షాలు రాజీనామా చేయాలి

– ఇండియా వేదిక నిరసనలో వక్తలు

ప్రజాశక్తి – యంత్రాంగం:దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు కీలకమైన పార్లమెంట్‌పై జరిగిన దాడికి హోంమంత్రి అమిత్‌ షా, ప్రధాని నరేంద్రమోడీ సమాధానం చెప్పాలని పట్టుబట్టిన 146 మంది పార్లమెంట్‌ సభ్యులను సస్పెండ్‌ చేయడం పార్లమెంట్‌ చరిత్రలోనే చీకటి అధ్యాయంగా నిలిచిపోతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. తక్షణం పార్లమెంట్‌ సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తివేసి పార్లమెంట్‌పై జరిగిన దాడిపై చర్చించాలని డిమాండ్‌ చేశారు. సస్పెన్షన్‌ను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఇండియా వేదిక ఆధ్వర్యంలో వామపక్ష పార్టీలు, కాంగ్రెస్‌, ఆప్‌ పార్టీలు శుక్రవారం నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.విజయవాడలోని లెనిన్‌ సెంటర్‌లో సిపిఎం నగర కార్యదర్శి దోనెపూడి కాశీనాథ్‌ అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో నోటికి నల్ల రిబ్బన్లను కట్టుకొని, నల్ల బెలూన్‌లతో మౌనప్రదర్శన చేపట్టారు. దేశభద్రత అంశంలో విఫలం అయిన మోడీ, అమిత్‌షా లు తక్షణం రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ… బిజెపికి చెందిన మైసూర్‌ ఎంపి సిఫార్సులతో వచ్చి పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన అంశంపై సమాధానం చెప్పలేక ప్రతిపక్షపార్టీలకు చెందిన 146 మంది ఎంపిలను బిజెపి ప్రభుత్వం సస్పెండ్‌ చేసిందని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసేలా పార్లమెంట్‌ భద్రతనే ప్రశ్నార్థకం చేసేలా గందరగోళం సృష్టిస్తుంటే రక్షణ కల్పించడంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందన్నారు. ఇంతటి ప్రమాదకరమైన అంశాన్ని దాచేలా బిజెపి ప్రభుత్వం పార్లమెంట్‌లో వ్యవహరిస్తోందని అన్నారు. పార్లమెంట్‌లో జరిగిన ఈ అప్రజాస్వామ్య వైఖరిని దేశం యావత్తు తీవ్రంగా ఖండిస్తుంటే రాష్ట్రంలోని వైసిపి, టిడిపి సిగ్గులేకుండా బిజెపి ముందు సాగిలపడుతున్నాయని విమర్శించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ.. ఇప్పటికే వ్యవస్థలన్నింటిని ధ్వంసం చేసిన నరేంద్ర మోడీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ.. మణిపూర్‌లో దాడులు, పార్లమెంట్‌పై జరిగిన దాడికి బిజెపి సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేశారు. 146 మంది ప్రతిపక్ష ఎంపిలను సస్పెండ్‌ చేసి 18 బిల్లులపై ఎలాంటి చర్చలేకుండా ఆమోదించుకున్నారని విమర్శించారు. మాజీ మంత్రి, రైతు సంఘాల సమన్వయ సమితి చైర్మన్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ… ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధారణ ప్రజలకూ ప్రశ్నించే హక్కు, మాట్లాడే హక్కులు ఉంటాయని, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఎంపిలకు కూడా ప్రశ్నించే హక్కులేదన్న రీతిలో సస్పెండ్‌ చేయడం అప్రజాస్వామ్య చర్య అని అన్నారు. బిజెపి నియంతృత్వ విధానాలకు చరమగీతం పాడాలని కోరారు. సిపిఐ ఎంఎల్‌ లిబరేషన్‌ పార్టీ నాయకులు హరనాథ్‌ మాట్లాడుతూ.. ఫాసిస్ట్‌ ధోరణితో కేంద్ర ప్రభుత్వం పోతోందని విమర్శించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, సిహెచ్‌ బాబూరావు, వి ఉమామహేశ్వరరావు, కె ప్రభాకర్‌రెడ్డి, సిపిఐ రాష్ట్ర నాయకులు జి కోటేశ్వరరావు, కాంగ్రెస్‌ నాయకులు గురునాథం, కొలనుకొండ శివాజి, ఆప్‌ నాయకులు ఫణిరాజు తదితరులు పాల్గన్నారు. అనంతపురంలో ఆర్‌టిసి బస్టాండ్‌, తిరుపతి అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. గూడూరు, శ్రీకాళహస్తి, బిఎన్‌ కండ్రిగలో నిరసన తెలిపారు. కర్నూలు కలెక్టరేట్‌ గాంధీ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. ఆలూరులో అంబేద్కర్‌ సర్కిల్‌లో నిరసన తెలిపారు. విజయనగరం ఆర్‌టిసి కాంప్లెక్సు జంక్షన్‌లో రాస్తారోకో చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జాంపేట గాంధీ బమ్మ వద్ద నిరసన తెలిపారు. ఒంగోలులోని అద్దంకి బస్టాండ్‌ సెంటర్‌, బాపట్లలో అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద, విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద, అనకాపల్లి జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు. ఏలూరు పాత బస్టాండ్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద, తాడేపల్లిగూడెంలో నలుపురంగు దుస్తులు ధరించి, నల్ల జెండాలతో నిరసన తెలిపారు.

➡️