ఇసి ఆదేశాల మేరకే డిఎస్‌సి

-సివిజిల్‌ యాప్‌లో ఫిర్యాదులు చేయండి -సిఇఒ ముఖేష్‌కుమార్‌ మీనా

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకే డిఎస్‌సి నిర్వహణపై తుదినిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా తెలిపారు. బరాష్ట్ర సచివాలయంలోని ఎలక్షన్‌ మీడియా సెంటర్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డిఎస్‌సిని వాయిదా వేయాలని కోరుతూ అనేక వినతులు అందుతున్నట్లు చెప్పారు. దీంతో ఈ అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకుపోయినట్లు తెలిపారు. అక్కడ నుండి వచ్చే ఆదేశాల మేరకే డిఎస్‌సిని నిర్వహించాలా..వాయిదా వేయాలా అన్న అంశంపై నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా సి విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదులు చేయాలని ఆయన సూచించారు. ఈ యాప్‌ ద్వారా వచ్చే ఫిర్యాదులపై 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని చెప్పారు. రెగ్యులర్‌ ఉద్యోగులతోపాటు కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది, వాలంటీర్లు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల కోడ్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్‌ను విధించినట్లు తెలిపారు. ఎటువంటి కార్యక్రమం అయినా అనుమతులు తీసుకోవాల్సిందేనని అన్నారు.

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటివారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. కోడ్‌ వచ్చిన ఈ నెల 16 నుండి ఇప్పటిదాకా వలంటీర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు కలిపి 46 మందిని విధుల నుండి తొలగించామని తెలిపారు. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, వలంటీర్లు అయితే విధుల నుండి తొలగిస్తామని, రెగ్యులర్‌ ఉద్యోగులు అయితే సస్పెండ్‌ చేస్తామని చెప్పారు. ప్రధాని కార్యక్రమంలో భద్రతా లోపాలపై ఫిర్యాదు అందిందని, కేంద్రానికి నివేదించామని అన్నారు. ప్రభుత్వ భవనాలపై నేతల ఫొటోలు, ప్రకటనలు తొలగించాలని ఆదేశించామని చెప్పారు. ఇప్పటి దాకా 1.99 లక్షల పోస్టర్లు, బ్యానర్లు, హౌర్డింగ్‌లు తొలగించామన్నారు. అలాగే 385 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామన్నారు. రాష్ట్రంలో 173 బృందాలు ఎన్నికల విధులను పర్యవేక్షణ చేస్తున్నాయని తెలిపారు. మూడు రోజుల పరిధిలో రూ 3.39 కోట్ల నగదును స్వాదీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. సినిమా టీజర్‌లో పవన్‌ కల్యాణ్‌ గాజు గ్లాసు చూపించిన అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. రాజకీయ హింస లేకుండా ఎన్నికలు నిర్వహించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. గిద్దలూరు, ఆళ్లగడ్డలో రాజకీయ హత్యలు, మాచర్లలో హింసాత్మక ఘటనలు జరిగాయని ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల ఎస్‌పిలను పిలిపించి మాట్లాడుతామని తెలిపారు. ఎస్‌పిల నివేదిక నివేదిక చూశాక చర్యలు తీసుకుంటామన్నారు. . సమావేశంలో అడిషనల్‌ సిఇఒలు కోటేశ్వరరావు, హరీంద్ర ప్రసాద్‌లు పాల్గన్నారు.

➡️