ఎన్నికల ప్రచారంలో అపశృతి

శ్రీసత్యసాయి : టీడీపీ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటుచేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి స్పృహతప్పి పడిపోయారు. మొదటి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తచెరువు మండల కేంద్రానికి సింధూర వచ్చారు. అదే రోజు ప్రచారం మొదలుకావడంతో పల్లె సింధూరకు ఘనస్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. భారీ ర్యాలీ నిర్వహించి.. పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు. అలాగే సింధూరకు పూల మాలలు వేసి.. దారి పొడవునా పూలు జల్లారు.ఒకవైపు ర్యాలీకి భారీగా వచ్చిన జనం.. మరోవైపు బాణసంచా కాల్చిన వాసన, మెడలో పూల దండలు.. దీనికి తోడు ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో సింధూరకు ఊపిరాడలేదు. శ్వాస సక్రమంగా అందకపోవడంతో ర్యాలీలోనే సొమ్మసిల్లి పడిపోయింది. అది గమనించిన భర్త కృష్ణ కిశోర్‌ రెడ్డి ఇతర మహిళా కార్యకర్తల సహాయంతో ఆమెను వాహనంలో నుంచి దింపి కారులో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని టీడీపీ శ్రేణులు తెలిపాయి.

➡️