ఎన్నికల సంఘమే స్పందించాలి – వలంటీర్ల వ్యవస్థపై హైకోర్టు

Mar 20,2024 23:55 #AP High Court, #judgement

ప్రజాశక్తి-అమరావతి :వలంటీర్ల వ్యవస్థపై కేంద్ర ఎన్నికల సంఘమే స్పందించాలని హైకోర్టు పేర్కొంది. వలంటీర్ల విషయంలో మధ్యంతర ఆదేశాలివ్వలేమని తేల్చి చెప్పింది. వలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గనకుండా గతంలోనే ఇసికి ఉత్తర్వులు జారీ చేశామని గుర్తు చేసింది. ఈ వ్యవహారంపై సమగ్ర వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్రంతోపాటు ఇసికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 3 నెలలకు వాయిదా వేస్తూ చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ రావు రఘునందన్‌రావుతో కూడిన డివిజన్‌ బెంచ్‌ బుధవారం ఆదేశాలిచ్చింది. వైసిపికి చెందిన 2.57 లక్షల మంది కార్యకర్తలను గ్రామ, వార్డు వలంటీర్లుగా నియమించారని, వీరి నియామకం చట్ట వ్యతిరేకమని, వీరిని ఎన్నికల విధుల్లో పాల్గనకుండా ఉత్తర్వులు జారీ చేయాలంటూ కడప జిల్లా, రాజంపేటకు చెందిన షేక్‌ అబూబాకర్‌ సిద్దిఖీ పిల్‌ దాఖలు చేశారు. అధికార వైసిపి వారే వలంటీర్లుగా ఉన్నారని సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదించారు. ‘వలంటీర్ల వల్ల ప్రజలకు మేలు జరుగుతోంది కదా’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది.

➡️