కథగాన కళలు తెలుగు భాషకు నిధులు

Feb 5,2024 07:53 #Burrakatha

– బుర్రకథపై వర్క్‌షాప్‌లో కళారత్న షేక్‌ బాబూజీ

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :తెలుగు భాషకు కథగాన కళలు నిధులని, వీటి నుండే శాస్త్రీయ కళలు పుట్టుకొచ్చాయని బుర్రకథ అధ్యాపకులు, కళారత్న షేక్‌ బాబూజీ అన్నారు. ప్రజల అవసరాలు తీరిస్తేనే ఏ కళకైనా మనుగడ ఉంటుందని తెలిపారు. బుర్రకథ పితామహులు పద్మశ్రీ షేక్‌ నాజర్‌ 124 జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలోని టైనీటాట్స్‌ కిండర్‌ జారు పాఠశాలలో పల్నాడు బాలోత్సవం కమిటీ ఆధ్వర్యాన బుర్రకథపై ఆదివారం వర్క్‌షాప్‌ నిర్వహించారు. బాలోత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి కట్టా కోటేశ్వరావు అధ్యక్షతన నిర్వహించిన సభలో నాజర్‌ కుమారుడు, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం బుర్రకథ కళా అధ్యాపకులు షేక్‌ బాబూజీ మాట్లాడుతూ సర్వ కళల సమాహారమే బుర్రకథని అన్నారు. శాస్త్రీయ కళల్లో ఆడేవారు, పాడేవారు, నటించేవారు వేర్వేరుగా ఉంటారని, కథాగాన కళలైన బుర్రకథ, బమ్మలాట, ఒగ్గుకథ, జముకుల కథ, పంబకథ తదితరాల్లో ఒక్కరే ఆడటం, పాడటం, మాట్లాడటం, నటించడం చేస్తారని వివరించారు. బుర్రకథను అనేక భాషల్లో అనువదించి ఆయా భాష సంస్కృతి, సంప్రదాయాలు నేర్పించాల్సిన ఆవశ్యకత ఉందని, ఇటువంటి కార్యక్రమాల నిర్వహణను ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరారు. బాలోత్సవం కమిటీ గౌరవాధ్యక్షులు ఎం.ఎస్‌ఆర్‌.కె ప్రసాద్‌, పల్నాడు బాలోత్సవం కమిటీ సభ్యులు కోయ రామారావు, మేడా సాంబశివరావు, అనుముల లక్ష్మీశ్వరరెడ్డి, టి.అంజిరెడ్డి మాస్టారు, టి.యోహాన్‌ రాజు, స్వర్ణ రామిరెడ్డి, కె.శివపార్వతి, బి.సలీం, టైనిటాట్స్‌ డైరెక్టర్‌ పాతూరి కోటేశ్వరమ్మ, చిన ఓబయ్య, ఏసుదయ తదితరులు బుర్రకథ కళారూపాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరాన్ని వివరిస్తూ ప్రసంగించారు. తొలుత నాజర్‌ చిత్ర పటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. సభ అనంతరం బాబూజీని బాలోత్సవ కమిటీ సత్కరించింది.

➡️