కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పించాలి : కూనంనేని

Dec 16,2023 15:22 #kunamneni sambasivarao, #speech

హైదరాబాద్‌: ‘ఓడిపోవడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం. ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో చూస్తాం..’ అని అనడం మంచిది కాదని.. కొత్త ప్రభుత్వానికి అందరూ సహకరించాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. పాత ప్రభుత్వం ఎందుకు విఫలమైందో కాంగ్రెస్‌ ప్రభుత్వం పరిశీలన చేసి పని చేయాల్సి ఉంటుందన్నారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కూనంనేని మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.”2020లో 17 రోజులు, 2023లో 11 రోజులు మాత్రమే సభ నడిచింది. అసెంబ్లీని ఎక్కువ రోజులు నిర్వహించేలా చూడాలి. నిర్మాణాత్మకంగా సభలో సభ్యులు మాట్లాడాలి. సభ్యుల మాటలు ఆరోగ్యదాయకంగా ఉండాలి. వ్యక్తిగత దూషణకు వెళ్లకుండా సభను పక్కదారి పట్టించకుండా మాట్లాడాలి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆనాడు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చారు. జలయజ్ఞానికి నిధులు వాటంతట అవే సమకూరాయి. హామీలు నెరవేర్చేందుకు డబ్బు ఇబ్బంది కాదు. కేంద్రం నుంచి రాష్ట్రానికి చాలా నిధులు రావాలి. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే 2 హామీలు నెరవేర్చారు. ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతున్నాం” అని అన్నారు.

➡️