కుదువ పెట్టిన బంగారంతో వడ్డాణం చేయించిన బ్యాంక్‌ మేనేజర్‌

Feb 2,2024 16:20 #bank loan fraud case, #penamalur

పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరు యూనియన్‌ బ్యాంకు శాఖ మేనేజరుగా పనిచేస్తున్న దావులూరి ప్రభావతిపై పెనమలూరు పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు. బ్యాంక్‌ మేనేజర్‌ బ్యాంకులో కుదువ పెట్టిన బంగారంతో వడ్డాణం చేయించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గతంలోనూ పలువురిని మోసం చేసి గంగూరు యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ డబ్బులు గుంజినట్లు పేర్కొన్నారు. గంగూరు బ్యాంకు మేనేజరుపై పెనమలూరు పోలీసుల కేసు నమోదు చేశారు.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గంగూరు యూనియన్‌ బ్యాంకు శాఖ మేనేజరుగా పనిచేస్తున్న ప్రభావతికి భర్తతో విబేధాలున్నాయి. ఆమె స్వగ్రామం నూజివీడు మండలం మర్రిబంధం గ్రామం కాగా.. అదే గ్రామానికి చెందిన కవులూరి యోగేశ్వరరావుకు హైదరాబాద్‌లో ఉన్న బ్యాంకు ఖాతాను ప్రభావతి గంగూరు శాఖకు ట్రాన్స్‌ఫర్‌ చేయించింది. ఈ సందర్భంగా యోగేశ్వరరావు తన వద్ద ఉన్న 380 గ్రాముల బంగారం కోసం లాకరు అడిగాడు. ప్రభావతి లాకరులో బంగారం దాయటం కన్నా బ్యాంకు రుణం తీసుకోమని ఆయనకు సూచించింది. దీంతో యోగేశ్వర రావు రూ.2 లక్షలు రుణం తీసుకున్నాడు. తీసుకున్న రుణాన్ని ఆయన గతేడాది నవంబరులో చెల్లించాడు. అనంతరం బ్యాంకులో తనఖా పెట్టిన బంగారు ఆభర ణాలు గురించి అడగ్గా ఆ నగలు తన వద్దనే ఉన్నాయని ప్రభావతి తెలిపింది. ఈ విషయమై గంగూరులోని తన ఇంటికి వచ్చి మాట్లాడమని కోరింది. యోగేశ్వరరావు ఆమె ఇంటికి వెళ్లి బంగారు ఆభర ణాలు విషయమై ప్రశ్నించగా తనంటే ఇష్టమని, పెళ్లి చేసుకోమని కోరింది. బంగారు ఆభరణాలతో వడ్డాణం చేయిస్తున్నానని చెప్పింది. ఒక్కసారిగా యోగేశ్వరరావు షాక్‌ తిన్నాడు. ఈ ఘటనపై యోగేశ్వరరావు పోలీసులను ఆశ్రయించాడు. తన ప్రమేయం లేకుండా తన సంతకాన్ని ప్రభావతి ఫోర్జరీ చేసి ఆభరణాలు కాజేసిందని పేర్కొన్నాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️