మెగా డిఎస్‌సిపైనే తొలి సంతకం

Mar 26,2024 21:46 #chandrababu, #kuppam, #TDP

– వంద రోజుల్లో డ్రగ్స్‌, గంజాయి అరికడతాం
– రెండో రోజు పర్యటనలో యువతతో చంద్రబాబు
ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో :రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అరవై రోజుల్లో మెగా డిఎస్‌సి ద్వారా లక్షా 50 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తానని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. రెండో రోజు మంగళవారం చిత్తూరు జిల్లా కుప్పంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కెవిఆర్‌ కల్యాణ మండపంలో టిడిపిలో చేరే వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం యువతతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లేక యువత అల్లాడుతోందని అన్నారు. ఏటా జాబ్‌ కేలండర్‌ అంటూ నిలువునా ముంచారని విమర్శించారు. ఐదేళ్లలో ఒక్క డిఎస్‌సి కూడా నిర్వహించకుండా.. ఎన్నికల ముందు హడావుడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దగా డిఎస్‌సి మాకొద్దని ఎన్నికల కమిషన్‌ను కోరాలని యువతకు సూచించారు. గతంలో తాను లక్షా 50 వేల టీచర్‌ పోస్టులను ఒకేసారి భర్తీ చేశానని తెలిపారు. అదే రీతిలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెగా డిఎస్‌సిపైనే తొలి సంతకం చేస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీకి శ్రీకారం చుడతామన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో డ్రగ్స్‌, గంజాయి, కల్తీ మద్యాన్ని అరికడతామని, సరసమైన ధరలకు నాణ్యమైన మద్యం సరఫరా చేస్తామని తెలిపారు. పరిశ్రమలు తెప్పించి యువతకు ఉపాధి చూపించాల్సిన జగన్‌మోహన్‌రెడ్డి ఉన్న పరిశ్రమలను వెళ్లగొడుతున్నారని, గంజాయి, డ్రగ్స్‌ ఇచ్చి యువతను మత్తులో ముంచేస్తున్నారని విమర్శించారు. అనంతరం కుప్పంలో గడప గడపకూ వెళ్లి సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా రామకుప్పం మండలం రాజుపేట వద్ద తాజాగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన హంద్రీనీవా కాల్వను పరిశీలించారు.
పూజారిపై వైసిపి దాడి అమానుషం
పూజారిపై వైసిపి దాడిని చంద్రబాబునాయుడు ఖండించారు. కుప్పం పర్యటనలో భాగంగా మీడియాతో ఆయన మాట్లాడారు. పూజారిని కాళ్లతో తన్నడం, కొట్టడం హేయమైన చర్యన్నారు. అర్చకుడంటే దేవునికి, భక్తునికి మధ్య అనుసంధానకర్తని, అలాంటి వ్యక్తిపై వైసిపి నేతలు దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.
చలమయ్య కుటుంబానికి ఆర్థిక సాయం : చంద్రబాబు
కుప్పంలో చంద్రబాబు సభకు వచ్చి తిరుగు ప్రయాణమై వెళుతుండగా గుట్టపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యారు. ద్విచక్ర వాహనాన్ని కారు ఢకొీనడంతో రామకుప్పం మండలం ఆనిగానూరు గ్రామానికి చెందిన చలమయ్య (32), నాగభూషణం (38)కు గాయాలయ్యాయి. స్థానికులు వీరిని చికిత్స నిమిత్తం పిఇఎస్‌ ఆస్పత్రికి తరలించారు. చలమయ్య చికిత్స పొందుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగభూషణంను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. చలమయ్య కుటుంబానికి రూ.మూడు లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

➡️