కౌలు రైతుల సమస్యలను మేనిఫెస్టోల్లో పెట్టండి

– రాజకీయ పార్టీలకు ఎపి కౌలు రైతు సంఘం విజ్ఞప్తి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రానున్న ఎన్నికలకు రాజకీయ పార్టీలు ప్రకటించే ఎన్నికల మేనిఫెస్టోల్లో కౌలు రైతుల సమస్యలను చేర్చాలని ఎపి కౌలు రైతు సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శుక్రవారం విజయవాడలోని బాలోత్సవ్‌ భవన్‌లో రాష్ట్రంలోని కౌలు రైతుల సమస్యలపై రూపొందించిన డిమాండ్‌ పత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతు సంఘం ఆవిష్కరించింది. కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు, రాష్ట్ర అధ్యక్షులు వై రాధాకృష్ణ, సహాయ కార్యదర్శి పంచికర్ల రంగారావు ఈ డిమాండ్‌ పత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎం హరిబాబు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలు రైతులు వున్నారని తెలిపారు. ప్రతి కుటుంబానికీ ముగ్గురు అనుకున్నా దాదాపు కోటి మంది సమస్యగా కౌలు రైతుల సమస్యలను రాజకీయ పార్టీలు చూడాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలురైతులు వుంటే, కేవలం నాలుగు లక్షల మందికి మించి కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి కౌలు రైతుకు రైతు భరోసాను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే కౌలు రైతులందరికీ ఒకసారి పూర్తి రుణమాఫీ చేయాలన్నారు. కౌలు రైతులకు నెలకు రూ.5 వేల పెన్షన్‌ ఇవ్వాలని, స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రుణాలివ్వాలని కోరారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేసియా చెల్లించాలన్నారు. అలాగే ఎకరాకు రూ.10 వేలు పెట్టుబడి సాయంగా ఇవ్వాలని కోరారు. ఆలయం భూములు సాగుచేసుకుంటున్న రైతులకు నేరుగా సిసి కార్డులు ఇచ్చి పంట రుణాలు, రైతు భరోసా ఇవ్వాలన్నారు. అలాగే కౌలు రైతులకు సంబంధించి ధాన్యం డబ్బును చెల్లించాలని కోరారు. ఈ సమస్యలన్నింటినీ తమ పార్టీ మేనిఫెస్టోల్లో చేర్చాలని వైసిపి, టిడిపి, కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ, ఆమ్‌ఆద్మీ, జై భారత్‌ నేషనల్‌ పార్టీ, తెలుగుసేన, నవతరం పార్టీలకు విజ్ఞప్తి చేశారు.

➡️