గిరిజనులకు, రైతులకు ‘హైడ్రో’ ముప్పు : సిపిఎం

Jan 2,2024 22:50 #cpm, #Dharna

ప్రజాశక్తి – దేవరాపల్లి (అనకాపల్లి): గిరిజనులకు, రైతులకు హైడ్రో పవర్‌ ప్రాజెక్టుతో తీవ్ర ముప్పు వాటిళ్లనుందని, రైవాడ జలాశయానికి నష్టం జరగనుందని సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె లోకనాథం అన్నారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీలోని బలిపురం సమీపం నుంచి వీలుపర్తి పంచాయతీ మారికకొండ వరకు అదానీ కంపెనీ తలపెట్టిన హైడ్రో పవర్‌ ప్లాంట్‌ నిర్మాణ నిమిత్తం మట్టి నమూనా పరీక్షలకు తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలను లోకనాథం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైడ్రో పవర్‌ ప్లాంట్‌ పనులు కోసం అదానీ కంపెనీ పర్యవేక్షణలో కొల్‌కతాకు చెందిన కంపెనీ ఈ తవ్వకాలు చేపట్టిందన్నారు. స్వయాన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జిల్లా మంత్రి బూడి ముత్యాలనాయుడు నియోజకవర్గంలో ఇదంతా జరుగుతోందని తెలిపారు. చింతలపూడి, తామరబ్బ పంచాయతీల సర్పంచ్‌లకూ, చివరికి స్థానిక తహశీల్దారుకు, జిల్లా కలెక్టర్‌కూ తెలియకుండా రహస్యంగా మట్టి నమూనాలను సేకరిస్తున్నారని తెలిపారు. దీనిని సిపిఎం వ్యతిరేకిస్తోందన్నారు. గతంలో రైవాడ ప్రాజెక్టుపై హైడ్రో పవర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి కేబినెట్‌ ఆమోదం పొందినట్లు వచ్చిన వార్తలు ఇప్పుడు నిజమయ్యాయన్నారు. దీనిపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో తాత్కాలికంగా పనులు నిలుపుదల చేశారన్నారు. గ్రామ సభలు జరపకుండా ప్రజల ఆమోదం లేకుండా మోసపూరితంగా అదానీ కంపెనీ ఈ తవ్వకాలు జరపడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. హైడ్రో పవర్‌ ప్రాజెక్టు పనులు ప్రారంభమైతే చింతలపూడి పంచాయతీలోని తొమ్మిది గ్రామాలు, తామరబ్బ పంచాయతీలోని ఏడు గ్రామాలతో పాటు పెద్ద మొత్తంలో వ్యవసాయ భూములు పూర్తిగా ముంపునకు గురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజనుల, రైతుల జీవనాధారం దెబ్బతింటుందన్నారు. తవ్వకాలను పరిశీలించిన వారిలో రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయనబాబు, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి వెంకన్న, మండల కార్యదర్శి బిటి దొర, స్థానిక గిరిజన ప్రజలు ఉన్నారు.

➡️