జగన్‌ మూర్కపు ప్రభుతంపై ఐక్యతతో ఉద్యమించాలి : ఎంఏ గఫూర్‌

  • 30వ రోజుకు చేరుకున్న అంన్వాడీల నిరసనలు

ప్రజాశక్తి-ఏలూరు : జగన్‌ మూర్కపు ప్రభుత్వంపై ఐక్యతతో, పట్టుదలతో ఉద్యమించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్‌ పిలుపునిచ్చారు. ఏలూరు కలెక్టర్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీల సమ్మె 30వ రోజుకు చేరుకుంది. ఈ ధర్నాలో ముఖ్యఅతిథిగా ఎంఎ గఫూర్‌ పాల్గొని ప్రసంగించారు. అంగన్వాడీల ఉద్యమం.. ఆకలి ఉద్యమమని జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వానికి ఆకలి విలువ తెలియదని అందుకే ఎస్మ మాలాంటి దుర్మార్గ చట్టాలను వీరిపై ప్రయోగించి.. తాడేపల్లి ప్యాలెస్‌లో కులుకుతున్నారని విమర్శించారు. ఇలాంటి ముర్కపు సిఎంపై మరింత ఐక్యతతో కార్మిక సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ పార్టీలు ఉద్యమించాలన్నారు. జీతాలు పెంచకుంటే ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదన్నారు. పనికి మాలిన సలహాదారులకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వానికి.. దళిత, బడుగు బలహీన వర్గాలకు సేవలు అందించే అంగన్వాడీలకు జీతాలు పెంచడానికి డబ్బులు లేవనడం సిగ్గుచేటన్నారు. తాడోపేడో తెలుసుకునేదాకా ఉద్యమాన్ని కొనసాగించాలన్నారు. అంగన్వాడీల ఉద్యమం రాష్ట్ర చరిత్రలో కార్మిక ఉద్యమాలకు, ప్రజా ఉద్యమాలకు ఎంతో ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. మహిళ కన్నీరు పెట్టుకుంటే ఏ కుటుంబం బాగుపడదని.. రాష్ట్రం కూడా బాగుపడదని.. లక్షలాదిమంది మహిళల కన్నీరు తెప్పిస్తున్న జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారం చేయకుంటే వారి కన్నీటిలో కొట్టుకుపోతోందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.లింగరాజు, అంగన్వాడీ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షురాలు కొర్రి విజయలక్ష్మి, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎర్ర రాంబాబు, సిఐటియు నగర కార్యదర్శి వి సాయిబాబు, ఆటో యూనియన్‌ జిల్లా కార్యదర్శి జే గోపి, యుటిఎఫ్‌ జిల్లా నాయకులు పీవీ నరసింహారావు, కనకదుర్గ ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులు పులి శ్రీరాములు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే.శ్రీనివాస్‌ తదితరులు ఈనిరసనలో పాల్గొన్నారు.

➡️