జన శంబరం

Jan 24,2024 10:57 #sirimanostavam, #vijayanagaram
  • వైభవంగా సిరిమానోత్సవం
  • లక్షలాదిగా తరలివచ్చిన యాత్రికులు
  • గంటన్నర ఆలస్యంగా సిరిమాను ఊరేగింపు
  • పట్టు వస్త్రాలు సమర్పించిన డిప్యూటీ సిఎం రాజన్నదొ

ప్రజాశక్తి – మక్కువ (పార్వతీపురం మన్యం జిల్లా) : రాష్ట్ర గిరిజన దేవతగా గుర్తింపు పొందిన శంబర పోలమాంబ అమ్మవారి తొలి జాతర వైభవంగా జరిగింది. మంగళవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో సిరిమాను ఊరేగింపు చేపట్టింది. ఈ సందర్భంగా అమ్మవారిని సుమారు లక్షన్నరకు పైగా భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆర్‌డిఒ కె.హేమలత సమన్వయంతో, అడిషనల్‌ ఎస్పీ సునీల్‌ సోరెన్‌ పర్యవేక్షణలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడు గంటల ప్రాంతంలో సిరిమానును అధిరోహిం చాల్సిన పూజారిని చదురు గుడి నుంచి తీసుకెళ్లేందుకు గ్రామ పెద్దలు గుడి వద్దకు రావడంతో పోలీసులు ఎక్కువ మందిని అనుమతించక పోవడంతో స్వల్ప వివాదం జరిగింది. దీంతో సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై నరసింహమూర్తి వివాదాన్ని సద్దుమణిగింప చేసి కార్యక్రమానికి మార్గం సుగుమం చేశారు. దీంతో సుమారు గంటన్నర ఆలస్యంగా పూజారి జన్ని జగదీష్‌ సిరిమాను అధిరోహించాల్సి వచ్చింది. ఎప్పటి మాదిరిగానే సావిడి వీధి నుంచి బయలుదేరిన సిరిమానుతో అమ్మవారు కేరళ వారి ఇంటి వద్ద పూజలు అందుకొని అనంతరం కరణం వారి ఇంటి వద్ద నుండి నేరుగా ఎస్సీ వీధి, పనుకు వీధి, గొల్ల వీధుల నుంచి మళ్లీ సావిడి ప్రధాన వీధికి చేరుకుని సిరిమానోత్సవం ముగింపు చేశారు.

ముమ్మరంగా ఆలయ తనిఖీలు

జాతరకు వచ్చే యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పరిమితికి మించి వాహనాల్లో భక్తులను ఎక్కించకుండా నడపాలని ఆర్‌టిఒ మల్లికార్జున రెడ్డి తమ సిబ్బందికి సూచించారు. ఈ మేరకు వ్యక్తిగత, ప్రైవేట్‌ వాహహనాల్లో ప్రయాణించే వాహన చోదకులు వారు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, త్రిబుల్‌ రైడింగ్‌ లు చేయకుండా పర్యవేక్షించారు. జాతర సమయంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అవగాహన కల్పిస్తూ పరిమితులు లేని వాహనాలుకు కేసులు కట్టడం ఫ్రంట్‌ సీటు సిట్టింగ్‌ కూడా లేకుండా చేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రమాదాలు జరగకుండా ముందుగా డ్రైవ్‌ నిర్వహించడం జరిగింది. స్పెషల్‌ డ్రైవ్‌లో మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు సాలూరు జేవీఎస్‌ ప్రసాద్‌, జి సత్యనారాయణ, రమేష్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు.

అందరికీ ధన్యవాదాలు

పోలమాంబ జాతర సజావుగా ప్రశాంతంగా జరిగినందుకు సహకరిం చిన అన్ని శాఖల అధికారులకు దేవాదాయశాఖ ఇఒ వివి సూర్యనారాయణ ధన్యవాదాలు తెలిపారు. జిల్లాస్థాయిలో అన్ని శాఖల అధికారుల నుంచి మండ ల సచివాలయ అధికారులకు, పారిశుధ్య కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్ర జాతరగా..

రాష్ట్ర జాతరగా అవతరించిన పోలమాంబ అమ్మవారికి ప్రభుత్వం తరఫున రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి పీడిక రాజన్నదొర పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు రాజన్నదొరకు పూర్ణకుంభంతో పూలమాల వేసే దేవాదాయశాఖ అధికారులు స్వాగతం పలికారు. మేళతాళాల నడుమ డిప్యూటీ సిఎం రాజన్నదొర అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సమ్మక్క, సారక్క జాతర తరువాత రాష్ట్ర జాతరగా తొలిసారి అవకాశం లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తొలిసారి అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనందంగా ఉందన్నారు.

➡️