టిటిడి ఉద్యోగులందరికీ ఇళ్లపట్టాలు

  • రెండో విడత పంపిణీలో భూమన కరుణాకరరెడ్డి
  • మిగిలినవారికి ఏర్పేడు వద్ద 450 ఎకరాలు సేకరణ

ప్రజాశక్తి – తిరుపతి సిటీ : టిటిడి ఉద్యోగులందరికీ అతి తక్కువ ధరకు ఇళ్లపట్టాలు ఇస్తున్నామని చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. రెండో విడత ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం సోమవారం తిరుపతి మహతి ఆడిటోరియంలో సోమవారం జరిగింది. మొత్తం 1703 మందికి ఇంటిస్థలాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్‌ కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ…ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు ఇచ్చే విషయం గురించి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని తాను సంప్రదించినప్పుడు ఉద్యోగులందరికీ ఉచితంగా ఇంటి స్థలాలు ఇద్దామని చెప్పారన్నారు. అయితే చట్ట ప్రకారం ఇందులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న కారణంగానే నామమాత్రపు ధరతో ఉద్యోగులకు, రిటైర్డ్‌ ఉద్యోగులందరికీ ఇంటి పట్టాలు మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి అంగీకరించారని తెలిపారు. మూడో విడతగా రిటైర్డ్‌ ఉద్యోగులకు, మిగిలిన ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వడం కోసం ఏర్పేడు మండలం పాగాలి వద్ద 350 ఎకరాల భూమిని టిటిడికి ఇవ్వడంలో కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి చేసిన కృషి అభినందనీయమన్నారు. ఇందుకోసం ధర్మకర్తల మండలిలో రూ. 87.50 కోట్లు మంజూరు చేయించడంలో ఇఒ ప్రత్యేక శ్రద్ధ చూపారని చెప్పారు. ఏర్పేడు వద్ద ఈ నెలాఖరులోపు 450 ఎకరాలను స్వాధీనం చేసుకుని మూడో విడతలో నాలుగు వేల మందికి పైగా ఉద్యోగులకు, రిటైర్డ్‌ ఉద్యోగులకు ఇంటిస్థలాలు అందజేస్తామని తెలిపారు.

➡️