ట్రాన్స్‌జెండర్లకు ‘ఉపాధి హామీ’

Mar 23,2024 10:01 #'Job Guarantee', #Transgenders

-సర్క్యులరు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి :ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి హామీ చట్టం వర్తింపజేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15న రాష్ట్రంలోని అందరు కలెక్టర్లకు, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్లకు సర్క్యులర్లు జారీ చేసింది. సమాజంలో ఓవైపు వివక్ష, మరోవైపు ఉపాధిలేమితో ట్రాన్స్‌జెండర్లు అవస్థలు పడుతున్నారు. ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాలంటూ ప్రభుత్వాలకు చాలా కాలంగా విన్నవించుకుంటున్నారు. పదేళ్ల తరువాత స్పందించిన సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ట్రాన్స్‌జెండర్లకు కోరిన వెంటనే ఉపాధి పనులు కల్పించాలని రాష్ట్రానికి సూచించింది. దీంతో, రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు జిల్లా స్థాయి అధికారులకు సర్క్యులర్‌ పంపింది. ఆ సర్క్యులర్‌ ప్రకారం….. ట్రాన్స్‌జెండర్‌ను ఒక కుటుంబంగా గుర్తించి ప్రత్యేక జాబ్‌కార్డు ఇవ్వాలి. దానికి సంబంధించిన నిర్దేశిత దరఖాస్తులో పురుషులు, స్త్రీలతోపాటు ట్రాన్స్‌జెండర్‌ కాలమ్‌ పొందుపర్చాలి. ఏదైనా గ్రామ పంచాయతీలో ఐదుగురు కంటే ఎక్కువ ట్రాన్స్‌జెండర్లు ఉంటే, వారిని ప్రత్యేక శ్రమశక్తి సంఘం (టిజిఎస్‌ఎస్‌ఎస్‌)గా ఏర్పాటు చేయాలి. పనిచేయలేరనే భావనతో వారి అభ్యర్థనను ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించడానికి వీల్లేదు. అలా చేస్తే చట్ట ఉల్లంఘనగా ప్రభుత్వం పరిగణిస్తుంది. ఇతర వేతనదారులతో కలిపి కూడా వారికి పని కల్పించవచ్చు. దీనికి ముందుగా ఆయా వేతనదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి తగు అవగాహన కల్పించాలి. పని ప్రదేశాల్లో ట్రాన్స్‌జెండర్లను కించపర్చే విధంగా మాట్లాడడం, వెకిలి చేష్టలు చేయడం వంటివి చట్టపరమైన నేరంగా పరిగణించాలి. వారి సమస్యల పరిష్కారానికి మండల, జిల్లా స్థాయిలో నోడల్‌ ఆఫీసర్లను నియమించాలి. సమాజంలో ట్రాన్స్‌జెండర్లకు వివక్షలేని వాతావరణం కల్పించడంతోపాటు అభివృద్ధిలో సమాన భాగస్వామ్యం కల్పించడం ఈ సర్క్యులర్‌ ముఖ్య ఉద్దేశం. ఆచరణలో అమలు తీరు, ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ మేరకు ఉంటుందో వేచి చూడాలి.

➡️