తెలంగాణ ఫలితంతోనైనా కనువిప్పు కలగాలి

Dec 4,2023 07:57 #cpm leader, #MA Gafoor, #press meet
  • రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు మేల్కోవాలి
  • ప్రజాప్రణాళికతో ఎన్నికల క్యాంపెయిన్‌ : ఎం.ఎ గఫూర్‌

ప్రజాశక్తి-కడప ప్రతినిధి : బిజెపితో లోపాయికారీ పొత్తు ద్వారా వ్యతిరేక ఫలితాలు తథ్యమని తెలంగాణ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌ అన్నారు. సిపిఎం కడప జిల్లా కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలకు తెలంగాణ ఎన్నికల ఫలితం కనువిప్పు కావాలన్నారు. తెలంగాణలో బిఆర్‌ఎస్‌ సర్కారు కొన్ని సంక్షేమ చర్యల్ని చేపట్టినప్పటికీ ఓటమి చెందడాన్ని గమనించాలని తెలిపారు. కేంద్రంలోని బిజెపి సర్కారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందన్నారు. పోలవరం మొదలుకొని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు వరకు తీవ్ర అన్యాయం చేసిందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఉపాధి కల్పన అంశాల్లో జగన్‌ ప్రభుత్వం నిరాశపరిచిందన్నారు. రాష్ట్రంలో కరువు సహాయక చర్యలు లేవని విమర్శించారు. కడపలో ప్రభుత్వ రంగంలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మించాలని ఉద్యమిస్తే జిందాల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుకు చొరవ తీసుకున్నప్పటికీ, ఎటువంటి పురోగతి లేదన్నారు. వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పనులు కల్పించడంలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధాలుగా ద్రోహం చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి ప్రశ్నించిన దాఖలాల్లేవని విమర్శించారు. అన్ని సందర్భాల్లోనూ టిడిపి కూడా బిజెపిని సమర్ధిస్తోండగా జనసేన ఎన్‌డిలోలో భాగస్వామిగా ఉందన్నారు. రాష్ట్రంలో రూ.60 పెట్రోల్‌, వంట గ్యాస్‌ రూ.400, నిరుద్యోగభృతి ఇవ్వాలని, ఇంకా 31 డిమాండ్లతో రూపకల్పన చేసిన ప్రజాప్రణాళిక సాధనకు వచ్చే ఎన్నికల్లోకి వెళ్తామన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపెయిన్‌ చేస్తామని తెలిపారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మనోహర్‌, రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️