త్వరలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం : మంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిఖ, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ అర్ధగణాంక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన 2014 ఫోరం డైరీని డాక్టర్‌ అంబేద్కర్‌ ప్రజా భవన్‌లో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్‌, అసోసియేట్‌ అధ్యక్షులు కస్తూరి వెంకట్‌ ఉద్యోగుల సమస్యలను ఉప ముఖ్యమంత్రికి వినతి పత్రం ద్వారా వివరించారు. అర్ధగణాంక శాఖ నూతన స్టాఫింగ్‌ పాటర్న్‌ , ఉప గణాంక అధికారి పోస్టులను మల్టీ జోన్‌ పోస్టుగా మార్చాలని కోరారు. ఉద్యోగుల పీఆర్సీ , పెండింగ్‌ లో ఉన్న కరువు భత్యం, పెండింగ్‌లో డీఏలు, సీపీఎస్‌ రద్దు, 317- జీవో ల వల్ల జరిగిన అన్యాయాలను సరి చేయాలని సూచించారు.ఉద్యోగులకు చందాతో కూడిన ఆరోగ్య కార్డ్స్‌ మంజూరు చేయాలని, ఆంధ్రాలో పని చేస్తున్న 84 మంది తెలంగాణ ఉద్యోగులను వెనక్కి తీసుకురావాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి త్వరలో ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించడం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్ధ గణాంక శాఖ సంచాలకులు దయానందం, టెస్సా కార్యదర్శి హరికఅష్ణ, మంత్రి ప్రగడ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️