దళితుడిపై పెత్తందారుల దాడి

Mar 22,2024 00:15

ప్రజాశక్తి-త్రిపురాంతకం (ప్రకాశం జిల్లా):ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని ఎండూరివారిపాలెం గ్రామంలో కుల వివక్ష పడగ విప్పింది. ఆ గ్రామంలో పంచాయతీ నిధులతో నిర్మాణం చేపట్టిన రోడ్లపై నడవనియ్యకపోవడం, దళితులకు చెందిన మురుగు నీటిని ప్రవహించకుండా పెత్తందారులు అడ్డుకున్నారు. దీంతో దళితులు గ్రామ పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేశారు. ఆయన వచ్చి పరిశీలించి ఇది పంచాయతీకి చెందినదని ఈ విషయంలో ఎవరు గొడవ పడవద్దని, ఇరు వర్గాలకు సర్ది చెప్పి వెళ్లారు. ‘మాపై పంచాయతీ అధికారికి ఫిర్యాదు ఇచ్చే మొనగాళ్లా..’ అంటూ ఫిర్యాదు చేసిన యామర్తి త్రిపురాంజనేయులును బుధవారం సాయంత్రం పెత్తందారులు బాసిబోయిన పేరయ్య, తోట గోవర్ధన్‌ కాళ్లతో తన్ని, చెప్పులతో కొట్టి దాడి చేశారు. గాయపడిన త్రిపురాంజనేయులును యర్రగొండపాలెంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు కుటుంబ సభ్యులు తరలించారు. త్రిపురాంజనేయులును గురువారం కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జువ్వాజి రాజు, బి.రఘురాం, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి దేవెండ్ల శ్రీనివాస్‌, సిఐటియు నాయకులు లాభాను, దళిత సంఘాల నాయకులు పరామర్శించారు. దాడి చేసిన వారిపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటి కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

➡️