నీలం జూట్‌ మిల్లు అక్రమ లాకౌట్‌ను ఎత్తివేయాలి : సిఐటియు

Mar 7,2024 20:55 #CITU, #Dharna

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌: శ్రీకాకుళం జిల్లా సింగుపురం వద్ద ఉన్న నీలం జూట్‌ మిల్లు యాజమాన్యం ప్రకటించిన అక్రమ లాకౌట్‌ను తక్షణమే ఎత్తివేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పేకల తేజేశ్వరారావు డిమాండ్‌ చేశారు. సిఐటియు, ఐఎఫ్‌టియు ఆధ్వర్యాన నగరంలోని డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌ కార్యాలయం వద్ద గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అక్రమ లాకౌట్‌ వల్ల పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న 650 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా యాజమాన్యం తీసుకున్న నిర్ణయం సరైంది కాదన్నారు. వెంటనే పరిశ్రమను తెరచి కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కలెక్టరు ఆదేశాలను సైతం యాజమాన్యం లెక్క చేయక సమావేశానికి గైర్హాజరు కావడాన్ని తప్పుబట్టారు. కార్యక్రమంలో నీలం జూట్‌ మిల్‌ కార్మిక సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.నాగేశ్వరరావు, నక్క సూరిబాబు, ఐఎఫ్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️